దోపిడీ దొంగల బీభత్సం | Thieves Wreak Havoc At Narsingi Of Rangareddy One Killed | Sakshi
Sakshi News home page

దోపిడీ దొంగల బీభత్సం

Jan 6 2023 3:13 AM | Updated on Jan 6 2023 3:13 AM

Thieves Wreak Havoc At Narsingi Of Rangareddy One Killed - Sakshi

కిషోర్‌రెడ్డి, నిహారిక

మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరు దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ముగ్గురిని కత్తులతో పొడవగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. మృతుడి బైక్‌ను చోరీ చేసి దానిపై పరారయ్యారు. పట్టుకునేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై ఆ ఇద్దరిలో ఓ నిందితుడు కత్తితో దాడి చేసి పరారవ్వగా.. ఆ పోలీసులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

బాధితులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. బుధవారం రాత్రి హైదర్‌షాకోట్‌కి చెందిన ట్రాన్స్‌జెండర్‌ నిహారిక(నరేష్‌) తన మిత్రులతో కలిసి నార్సింగి రక్తమైసమ్మ గుడి సమీపంలో కోకాపేటకు చెందిన తులసికుమార్‌ అనే వ్యక్తితో మాట్లాడుతుండగా.. అక్కడికి వచ్చిన ఇద్దరు దుండగులు తులసికుమార్‌ను కత్తితో పొడిచి అతడి నుంచి రూ.15వేలు లాక్కున్నారు.

కత్తి దాడిలో అతని చేతి వేళ్లు తెగిపోయాయి. అక్కడే ఉన్న ట్రాన్స్‌జెండర్‌లను డబ్బుల కోసం డిమాండ్‌ చేశారు. దీంతో నిహారిక తన భర్త కిషోర్‌రెడ్డి(35)కి ఫోన్‌ చేసింది. దాంతో అతను తన మిత్రుడు శివరాజ్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే తులసికుమార్‌ ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఈ లోగా నిందితులు అక్కడి నుంచి జారుకున్నారు.  


శివరాజ్‌ 

ఆ తర్వాత దారి కాచి హత్య... 
ఆ తర్వాత ఇద్దరు దుండగులు గంధంగూడ దారిలో కిషోర్‌రెడ్డి, అతని మిత్రుడు శివరాజ్‌లను అడ్డగించి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కిషోర్‌ అక్కడికక్కడే మృతి చెందగా శివరాజ్‌ స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. మృతుడు కిషోర్‌ ద్విచక్రవాహనం తీసుకుని వారు అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, దుండగుల్లో ఒకతను సిక్కు వేషధారణలో ఉండగా మరొకతను మాస్క్‌ ధరించి ఉన్నాడని నిహారిక తెలిపారు. నిందితులను గుర్తించిన నార్సింగి పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. 

ఎస్‌ఓటి పోలీసులపై దాడి 
జగద్గిరిగుట్ట: నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో హత్య కేసు నిందితుడు కరణ్‌సింగ్‌.. కూకట్‌పల్లి సిక్‌ బస్తీలోని భగవాన్‌సింగ్‌ అనే వ్యక్తి ఇంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో మాదాపూర్‌ ఎస్‌ఓటి పోలీసులు విజయ్, రాజు గురువారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడి చేశారు. అప్పటికే పోలీసుల రాకను గమనించిన కరణ్‌ సింగ్‌ కత్తితో వారిపై దాడి చేసి పారిపోయాడు.. దాడిలో రాజు తలకు గాయం కావడంతో కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఛాతీపై తీవ్ర గాయాలైన విజయ్‌ను మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందడంతో బాలానగర్‌ డీసీపీ సందీప్‌ గోనె, మాదాపూర్‌ ఎస్‌ఓటీ క్రై మ్‌ అడిషనల్‌ డీసీపీ నారాయణ, బాలానగర్‌ ఏసీపీ గంగారామ్, జగద్గిరిగుట్ట సీఐ సైదులు తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గురువారం రాత్రికి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement