కక్ష భార్యది.. పథకం అతడిది

Seven People In Police Custody Case Of Six People Burnt Alive In Mancherial - Sakshi

ఆరుగురు సజీవదహనం కేసులో పోలీసుల అదుపులో ఏడుగురు

శాంతయ్య భార్య కోరడంతో రిస్క్‌ చేసిన రియల్‌ వ్యాపారి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: తన భర్త వేరొకరితో సహజీవనం చేస్తూ తమను పట్టించుకోవడం లేదని కక్షగట్టిన భార్య.. తన భర్తతో పాటు మరో ఐదుగురు మంటల్లో బూడిద అయ్యేలా చేసింది. ఈ నెల 17న మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌ ఎమ్మెల్యే కాలనీలో ఓ ఇంటికి నిప్పు పెట్టడంతో ఆరుగురు సజీవ దహనమైన విషయం తెలిసిందే. ఈ కేసును  పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు, కాల్‌డేటాలు సేకరిస్తున్నారు. 

రెండు క్యాన్లలో పెట్రోల్‌ కొని..
నిందితులు పెట్రోల్‌ కొనుగోలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 16న రాత్రి 9.53 గంటలకు నస్పూర్‌లోని షీర్కేకు వెళ్లే దారిలో ఉన్న ఓ బంకు నుంచి పెట్రోల్‌ తీసుకెళ్లారు. ఆటోలో రెండు క్యాన్లలో పెట్రోల్, తర్వాత ఆటోలోనూ డిజిల్‌ పోయించుకుని వెళ్లారు. ఆ సమయంలో డ్రైవర్‌తో పాటు లోపల మరొకరు కూర్చున్నారు. అతనే బంకు సిబ్బందికి రూ.5 వేల వరకు ఇచ్చాడు.

రెండు  క్యాన్లలో 40 లీటర్ల వరకు కొనుగోలు చేశారు. పక్కా పథకం ప్రకారమే పెట్రోల్‌ తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టారు. లక్షల మొత్తం ఆశ చూపి..: మృతుడు శాంతయ్య భార్య సృజనకు దగ్గరి వ్యక్తిగా ఉన్న లక్సెట్టిపేట వాసి, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన రియల్‌ వ్యాపారి అన్నీ తానై వ్యవహరించాడు. ఇతనికి పట్టణంలోనే డ్రైవర్‌గా పని చేసే ఓ యువకుడు, గతేడాది జూన్‌ 2న లక్సెట్టిపేటలో ఓ మహిళ తన భర్తను చంపించిన కేసులో నిందితుడొకరు, వెంకటాపూర్‌ పరిధిలోని గుడిపెల్లి వ్యక్తి వీరికి సహకరించారు. సృజన సోదరుడైన గోదావరిఖనికి చెందిన కానిస్టేబుల్‌ పాత్రపైనా విచారణ జరుగుతోంది. ఈ దారుణం చేసేందుకు నిందితులకు లక్షల్లో డబ్బు ఆశ చూపారు. ఆ ఖర్చు సృజన భరించింది.

ఆరోజు ఏం జరిగింది..
ఘటన జరిగిన రోజు 9గంటల ప్రాంతంలో సీసీసీలో ఉండే ఆటోడ్రైవర్‌కు ఫోన్‌ చేసి కిరాయి ఉంది రావాలని, రూ.వెయ్యి ఇస్తామని అడిగారు. అందుకు తాను అన్నం తిని వస్తానని చెప్పాడు. ఆలస్యమవుతోందనడంతో తన ఇంటి పక్కనే ఉన్న మరో ఆటో డ్రైవర్‌ను పంపాడు. బంకుకు వెళ్లి పెట్రోల్‌ తీసుకుని ఇద్దరు చెప్పినట్లుగా వెంకటాపూర్‌ వైపు తీసుకెళ్లాడు. ఘటన స్థలానికి కొద్ది దూరంలోనే ఆటో నిలిపి..‘మాకు గొడవలు జరుగుతున్నాయి. ఇంకొకరు రావాల్సి ఉంది. నీవు వెళ్లు..’ అని అతడిని పంపించారు. తర్వాత అక్కడ గుడిపెల్లికి చెందిన మరొకరి సాయంతో శివయ్య ఇంటివైపు వెళ్లారు. స్థానికుడి సాయంతో పెట్రోల్‌ను ఇంటిపైన, చుట్టూ చల్లి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. 

మరిన్ని ఆధారాల కోసం..
ఆదివారం రాత్రి వరకు ఏడుగురిని కాసిపేట పోలీసుస్టేషన్‌లో ఉంచారు. శాంతయ్య భార్య, కూతురు, ఆటోడ్రైవర్, రియల్‌ వ్యాపారి, మరో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నా రు. నిందితులు చెబుతున్న ప్రకారం పోలీసులు సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేసేందుకు సిద్ఢమవుతున్నారు. వివరాలు బయటకు వెల్లడించడం లేదు.  ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మొదట అనుమానాస్పద మృతి కేసు న మోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ, ఫోన్‌ కాల్‌డేటా, నిందితుల చెప్పిన వివరాలు, ఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలతో హత్యానేరంగా సెక్షన్లు చేర్చి ముందుకు సాగుతున్నారు. కేసు విచారణ వేగంగా కొనసాగుతోందని, అన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు.

భార్యాభర్తల మధ్య డబ్బు గొడవలు!
లక్సెట్టిపేట మండలం ఊత్కూరులో శాంతయ్య తండ్రికి వారసత్వంగా వచ్చిన 1.15ఎకరాల భూమి వివాదం ఉంది. ఈ భూమిని కొందరు వెంచరు వేయగా ఇరువర్గాల్లో భూ హక్కులపై తగాదా ఉంది. ఇటీవల ఈ కేసులో రాజీ కుదరడంతో రూ.90 లక్షలు వచ్చాయి. ఇందులో ఐదు వాటాలు వేస్తే శాంతయ్య వాటాగా రూ.12 లక్షలు వచ్చాయి. అప్పటినుంచి శాంతయ్య, సృజన మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని, ఈ కక్షలే చంపేవరకు తీసుకెళ్లాయని తెలుస్తోంది. శాంతయ్యకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఆర్కే5లో మైనింగ్‌ సర్దార్‌గా పని చేస్తున్న ఆయనకు మరో ఏడేళ్ల సర్వీసు ఉంది. ఈలోపే దారుణం జరిగింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top