దారుణం: తల్లీబిడ్డలను వేరుచేసి అంత్యక్రియలు..గర్భిణి మృతిపై విచారణ..

Separated  Mother And Children For Funeral - Sakshi

కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఐదు ఆస్పత్రులను గుర్తించిన డీఎంహెచ్‌వో 

త్వరలో ఉన్నతాధికారులకు నివేదిక

తల్లీబిడ్డలను వేరు చేసి అంత్యక్రియలు 

కాప్రా:  కరోనా ఉందనే అనుమానంతో ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో.. ఓ నిండు గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటనపై మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) మల్లికార్జునరావుకు అప్పగించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మల్లికార్జునరావు శనివారం వైద్య సిబ్బందితో కలిసి పావని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెను ఏయే ఆస్పత్రులకు తీసుకెళ్లిందీ, ఏం జరిగిందన్న వివరాలను సేకరించారు. ఐదు ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి విచారణ చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నారు. 

కనికరం లేని ఆస్పత్రులు.. 
హైదరాబాద్‌ శివార్లలోని మల్లాపూర్‌ నాగలక్ష్మినగర్‌కు చెందిన నిండు గర్భిణి పావని.. శుక్రవారం వైద్యం కోసం ఆస్పత్రులు తిరుగుతూ అంబులెన్సులోనే ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వరుసగా ఐదు ఆస్పత్రులకు వెళ్లామని, కరోనా అనుమానంతో ఎవరూ చేర్చుకోకుండా ఆమె మరణానికి కారణమయ్యారని పావని తల్లిదండ్రులు జోగారావు, నీలవేణి రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. ఘటనతో ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యంపై అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. 

తల్లీబిడ్డలను వేరుచేసి అంత్యక్రియలు 
పావని మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు శనివారం మల్లాపూర్‌ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారికి ఊహించని ఘటన ఎదురైంది. ఆచారం ప్రకారం తల్లీబిడ్డలను వేర్వేరుగా తీసుకొస్తేనే దహన సంస్కారాలు నిర్వహిస్తామని శ్మశానవాటిక నిర్వాహకులు తేల్చి చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పావని మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. తల్లితోపాటు కడుపులోనే చనిపోయిన బిడ్డను వేరు చేయాలంటూ.. మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఇందుకు ఏ ఆస్పత్రిలోనూ వైద్యులు ముందుకు రాలేదు.

అప్పటికే పుట్టెడు దుఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఇది మరింత వేదనకు గురి చేసింది. చివరికి ప్రభుత్వ అధికారుల జోక్యంతో ఓ ఆస్పత్రిలో తల్లి, బిడ్డల మృతదేహాలను వేరు చేశారు. తర్వాత మల్లాపూర్‌ శ్మశానవాటికలో తల్లి, బిడ్డలకు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పావని కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాగా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు డబ్బుల యావే తప్ప.. సరైన వైద్యం అందించాలన్న ధ్యాసే లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటన మరే ఆడబిడ్డకు జరగకూడదని, సదరు ఆస్పత్రులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top