రెచ్చిపోయిన దొంగల ముఠా: ఏకంగా రూ.6 కోట్ల మొబైల్స్‌ దోచేశారు

Rs 6 crore worth mobile phones carrying Larry by Gang   - Sakshi

రూ.6 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు దోపిడీ 

 చైనా మొబైల్‌ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ  ఫోన్లు చోరీ

కోలారు: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు. కంటైనర్‌ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్‌ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా, ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.  చైనా మొబైల్‌ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లతో  బయలుదేరిన కంటైనర్‌ను  వెంటాడి మరీ దోచుకున్న వైనం కలకలం రేపింది.  దీనిపై కేసు నమోదు  చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ముళబాగిలు పోలీసుల కథనం మేరకు...చెన్నై నుంచి బెంగళూరుకు ఎంఐ కంపెనీకి చెందిన సెల్‌ఫోన్ల లోడ్‌తో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన కంటైనర్‌ లారీ (నం.కేఏ01ఏపీ6824) బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత  ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన 8 మంది దుండగులు లారీని అడ్డగించారు.

డ్రైవర్‌ను తాళ్లతో బంధించి నిర్జన ప్రదేశంలో వదిలేసి సెల్‌ఫోన్ల లారీతో ఉడాయించారు. నేర్లహళ్లి గ్రామం వద్ద సెల్‌ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున డ్రైవర్‌ కట్లు విప్పుకుని ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్‌ జోన్‌ ఐజీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ కిశోర్‌బాబు, డీఎస్పీ గోపాల్‌ నాయక్, ముళబాగిలు ఎస్‌ఐ ప్రదీప్‌ సింగ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ గోపాల్‌నాయక్‌ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.  
 
సెల్‌ఫోన్‌ బాక్స్‌లు ఎత్తుకెళ్లిన  తర్వాత ఖాళీగా ఉన్న కంటైనర్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top