మెడికల్‌ కాలేజీల్లో ఆగని ర్యాగింగ్‌ ! | Ragging in medical colleges | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల్లో ఆగని ర్యాగింగ్‌ !

Published Sat, Oct 21 2023 1:38 AM | Last Updated on Sat, Oct 21 2023 4:33 AM

Ragging in medical colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:మెడికల్‌ కాలేజీల్లో జూనియర్లపై సీనియర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ పేరిట సీనియర్లు వేధిస్తున్నారు. మొదటి ఏడాది తరగతులు ప్రారంభమైన వారం పది రోజుల్లోనే గాంధీ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు సీనియర్లు ఫస్టియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ హాస్టల్‌ గదులకు రప్పించి బలవంతంగా మద్యం, సిగరెట్‌ తాగించినట్లు తేలింది. దీంతో మానసిక వేదనకు గురైన బాధిత విద్యార్థులు అధికారులకు తాము పడిన హింసను వివరించారు.

కొందరితో దుస్తులు విప్పించి డ్యాన్స్‌లు చేయించారని జూనియర్లు వాపోయారు. కొందరు విద్యార్థినులపై కూడా ర్యాగింగ్‌ జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 10 మంది సీనియర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులపై వేటు పడింది. అయినా అక్కడ ర్యాగింగ్‌ ఆగడం లేదు. ఇటీవల కూడా మరికొందరు జూనియర్‌ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. దీంతో మరోసారి సస్పెన్షన్‌ వేటు పడింది. అధికారులు చర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

రాష్ట్రంలో పలు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో కూడా ర్యాగింగ్‌ సంఘటనలు జరుగుతున్నా అవి బయటకు పొక్కడం లేదని, ఇతర ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోనూ ర్యాగింగ్‌ జరుగుతోందని విద్యార్థులు చెబుతున్నారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ, మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలోనూ ర్యాగింగ్‌ సంఘటనలు వెలుగుచూశాయి. కొన్నిచోట్ల మందలించి వదిలేయగా, కొన్నిచోట్ల సీనియర్లను సస్పెండ్‌ చేశారు. అయినా ర్యాగింగ్‌ ఆగడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.

నిఘా వ్యవస్థ కరువు
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిరోజుల నుంచే ర్యాగింగ్‌ ఘటనలు వెలుగులోకి రావడం ప్రారంభమయ్యింది. యూజీసీ ఆధ్వర్యంలోని యాంటీ ర్యాగింగ్‌ సెల్‌కు కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో యూజీసీ స్పందించింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీని ఆదేశించింది. మరోవైపు స్థానిక పోలీసులకూ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌కు పాల్పడొద్దని అన్ని తరగతుల విద్యార్థులకు అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.

ర్యాగింగ్‌కు పాల్పడితే కాలేజీ నుంచి తీసేయాలన్న నిబంధనలు ఉన్నాయని, కానీ తాము విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్‌ వరకే పరిమితం అవుతున్నామని వైద్య విద్య వర్గాలు హెచ్చరించాయి. కానీ ర్యాగింగ్‌ను నివారించేందుకు, వైద్య కళాశాలల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీలుగా సరైన నిఘా వ్యవస్థ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో ర్యాగింగ్‌ జరుగుతున్నా కొన్ని కాలేజీలు డీఎంఈ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంలేదని తెలిసింది.

గాంధీ, కాకతీయ సహా పలు కాలేజీల్లో సీసీ కెమెరాలు లేవన్న విమర్శలు విన్పిస్తున్నాయి. యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు ఉన్నా అవి అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయని అంటున్నారు. కాగా డీఎంఈ కార్యాలయం మాత్రం ర్యాగింగ్‌ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీలను ఆదేశించింది. ర్యాగింగ్‌ నిరోధక కమిటీలను పటిష్టం చేయాలని, ఎక్కడైనా కమిటీలు లేకపోతే తక్షణమే ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement