భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని.. భార్య ఎంత పనిచేసిందంటే..

Private Teacher Commits Suicide In Visakhapatnam - Sakshi

పరవాడ(విశాఖ జిల్లా): భర్త పాఠశాలకు వెళ్లొద్దాన్నాడని మనస్తాపంతో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరవాడ మండలం కన్నూరు గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పరవాడ ఎస్‌ఐ సిరపరపు సురేష్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలేనికి చెందిన చింతల అప్పారావుకు మల్కాపురానికి చెందిన పెంబులి లక్ష్మి కుమార్తె రాజేశ్వరితో 2012లో వివాహమైంది. దంపతులిద్దరూ కన్నూరు రామాలయం వెనక వీధిలో ఓ అద్దె ఇంట్లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి వంశీ(5), వివేక్‌(3) పిల్లలున్నారు.

చదవండి: కట్టుకున్న భర్తను హతమార్చి.. నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి..

అప్పారావు కశింకోట మండలంలోని ఓ పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌గా పని చేస్తున్నాడు. డిగ్రీ వరకు చదువుకున్న రాజేశ్వరి నాలుగు నెలల నుంచి తోటాడలో ఓ ప్రైవేటు పాఠశాలలో టీచరుగా పని చేస్తోంది. భార్యభర్తలు అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజేశ్వరిని స్కూల్‌కు వెళ్లడం మానేసి ఇంటి దగ్గర ఉంటూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అప్పారావు కొంత కాలం నుంచి చెబుతున్నాడు.

సోమవారం ఉదయం అప్పారావు స్కూల్‌కు వెళ్లేటప్పుడు భార్యకు మళ్లీ అదే విషయాన్ని చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన రాజేశ్వరి లుంగీతో ఇంట్లో ఫ్యాన్‌ హుక్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడే ఉన్న చిన్న కుమారుడు ఏడుపుతో చుట్టు పక్కల వారు వచ్చి రాజేశ్వరిని కిందకు దించారు. అప్పటికే రాజేశ్వరి మృతి చెందింది. తన కుమార్తె మృతిపై తమకు ఎటువంటి అనుమానం లేదని మృతిరాలి తల్లి లక్ష్మి పరవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించి, పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top