ప్రతీకారం: ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో వల వేసి

Police Solved Assassination Case At Guntur district - Sakshi

హత్య కేసును ఛేదించిన పోలీసులు

పథకం ప్రకారమే హత్య 

మాచర్ల రూరల్(గుంటూరు జిల్లా)‌: ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడీ సృష్టించి తన దగ్గరకు రావాలి, కలుద్దామని నాగరాజుకి వల వేసి పథకం ప్రకారం హత్య చేసినట్లు గురజాల డీఎస్పీ జయరామ్‌ప్రసాద్‌ తెలిపారు. శనివారం రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన కంచర్ల నాగరాజు ఈ నెల 20వ తేదీన నర్సరావుపేటలో పని ఉందని చెప్పి వెళ్లి అదృశ్యమయ్యాడు. అతని భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా నాగరాజు చదువుకునే రోజులలో నర్సరావుపేట మండలం తురకపాలెం గ్రామానికి చెందిన షేక్‌ అసియాను 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గుంటూరులో కాపురం పెట్టిన కొద్దిరోజులకే అసియా ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును 2017లో జిల్లా కోర్టు కొట్టివేసింది. ఇది జీర్ణించుకోలేని అసియా బంధువులు నాగరాజును ఎలాగైనా హతమార్చాలని పథకం పన్ని రెండుసార్లు విఫలమయ్యారు. చదవండి: జంట హత్యల కేసు: భాస్కర్‌, రాజు ఏమయ్యారు?

ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో నకిలీ ఐడీని సృష్టించి ఆన్‌లైన్‌లో చాటింగ్‌ జరిపి చిలకలూరిపేటలోని సుభానినగర్‌లో ఉన్న అబ్దుల్‌ సలీం ఇంటికి రప్పించారు. నాగరాజు ఇంట్లోకి రాగానే లోపల తలుపులు బిగించి నోటిలో గుడ్డలు కుక్కి చితకబాది మెడకు తాడు వేసి హత్య చేశారు. నాగరాజు మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి కారులో నర్సరావుపేట శివారులోని పెద తురకపాలెం గ్రామంలో ముద్దాయిలకు చెందిన మట్టి క్వారీలో నిర్మానుష్య ప్రదేశంలో దహనం చేశారు. చదవండి: వలంటీర్‌పై దాడి చేసి పింఛన్‌ సొమ్ము దోపిడీ

ఈ కేసులో నిందితులైన షేక్‌ అబ్దుల్‌సలీం, నబీజానీ, మీరాజిలానీ, పఠాన్‌ అక్బర్‌ వలి, సయ్యద్‌ అబ్బాస్, సయ్యద్‌ పీరువలి, తుబాటి సలీంలను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మిస్సింగ్‌ కేసును ఛేదించటంలో రూరల్‌ సీఐ భక్తవత్సలరెడ్డి నేతృత్వంలో పట్టణ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు రామాంజనేయులు, సు«దీర్‌కుమార్, పాల్‌ రవీందర్‌లు ప్రత్యేక దర్యాప్తు జరిపి కేసును ఛేదించారు. అలాగే నర్సరావుపేట, చిలకలూరిపేట సీఐ రోశయ్య, బిలాలుద్దీన్, ఎస్సైలు షఫీల కృషిని జిల్లా రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని ప్రత్యేకంగా అభినందించి రివార్డుకు రికమండ్‌ చేసినట్లు తెలిపారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top