అనుమానంతోనే తల్లీకొడుకుల హత్య

Police Says Man Eliminated Mother Son Nizamabad District - Sakshi

వర్ని: అనుమానమే పెనుభూతమై, తల్లీకొడుకుల హత్యకు దారి తీసింది. చందూర్‌ మండలం ఘన్‌పూర్‌ అటవీ ప్రాంతంలో జరిగిన తల్లీకొడుకుల హత్యకు అనుమానమే కారణమని పోలీసులు తెలిపారు. మృతదేహాలను సోమవారం వెలికి తీశారు. రుద్రూర్‌ సీఐ అశోక్‌రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి ఉదయం నిందితుడిని తీసుకుని అటవీ ప్రాంతంలోకి  వెళ్లారు. నిందితుడు చూపిన ప్రాంతంలో చూడగా, మృతదేహాలు కనిపించాయి. తహసీల్దార్‌ వసంత సమక్షంలో మృతదేహాలను వెలికి తీసి పంచనామా చేశారు. మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన రావడంతో బోధన్‌ ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించి అక్కడే పోస్టుమార్టం చేయించారు. 

ముందుగానే ప్లాన్‌ వేసుకుని.. 
వర్ని మండలం హుమ్నాపూర్‌కు చెందిన సుజాత (34), ఆమె కొడుకు రాము(2)ను చందూర్‌ మండలం ఘన్‌పూర్‌కు చెందిన రాములు హత్య చేసినట్లు బోధన్‌ ఏసీపీ రామరావు తెలిపారు. మృతదేహాలను వెలికితీసిన అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. మూడేళ్లుగా సుజాతతో రాములు సహజీవనం చేస్తున్నాడు. వీరికి కుమారుడు రాము(2) ఉన్నాడు. సుజాత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న రాములు.. ఇతరులతో ఎందుకు తిరుగుతున్నావని ఇటీవల బోధన్‌లో ప్రశ్నిస్తే నీకేందుకని ఆమె బదులిచ్చింది. ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో రాములు పగ పెంచుకొని తల్లీకొడుకును చంపాలని ప్లాన్‌ చేశాడు.(చదవండి: మనస్తాపంతో ఆత్మహత్య

ఈ క్రమంలో డిసెంబర్‌ 31న కట్టెలు తీసుకు వద్దామని సుజాతను, కొడుకును తీసుకుని అడవిలోకి వెళ్లాడు. పథకం ప్రకారం ఇద్దరిని హత్య చేసి మృతదేహాలను ఒర్రెలో పడేసి మట్టి వేసి, చెట్ల ఆకులు కప్పి వెళ్లి పోయాడు. కూతురు, మనవడి జాడ చెప్పాలని సుజాత తల్లి లస్మవ్వ రాములును అడిగినా చెప్పకపోవడంతో ఆదివారం వర్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. రాములును అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడని ఏసీపీ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top