గుట్టురట్టు: కవర్‌ను లాగితే నకిలీ తేలింది..

Police Arrested Fake Seed Covers Gang In Kurnool District - Sakshi

నకిలీ విత్తన కవర్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

నిందితుల అరెస్ట్‌.. యంత్రాలు స్వాధీనం.. మరింత లోతుగా దర్యాప్తు 

కర్నూలు: నకిలీ విత్తన కవర్ల తయారీదారులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారం రోజుల క్రితం ఆదోని మండలం చిన్న పెండేకల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, జయరాముడు నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తుండగా ఆదోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వెంకటేశ్, గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నకిలీ కవర్లు అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో వారిని అరెస్ట్‌ చేయగా.. హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్‌ రోటో ప్యాకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరు బయటకు వచ్చింది. ఆ కంపెనీ సీఈఓ బొగుడ సురేష్‌..నకిలీ కవర్లు తయారు చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అంతేకాకుండా రూ. 2 కోట్ల విలువ చేసే యంత్రాలు, ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ విత్తన ముఠాలపై దృష్టి..
శివారు ప్రాంతాల్లోని పాడుబడిన భవనాలు, మూతపడిన మిల్లులు, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాలుగా మార్చుకుని నకిలీ విత్తన దందా సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో నకిలీ విత్తన ముఠాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఎస్పీ ఫక్కీరప్ప క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఏజెంట్లను నియమించుకుని దందా సాగిస్తున్నారో పోలీసులు సమాచారాన్ని రాబడుతున్నారు. స్పిన్నింగ్‌ మిల్లుల్లో పత్తిని తీసిన తరువాత మిగిలిన గింజలనుయాసిడ్‌తో శుద్ధి చేసి నిగనిగలాడేలా చేసి ఏదో ఒక బ్రాండ్‌ పేరుతో ప్యాకింగ్‌ చేసి రైతులకు అంటగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీలపై సమాచారం కోసం.. 
నకిలీలపై సమాచారం కోసం పోలీసు శాఖ వాట్సాప్‌ నంబర్‌ను కేటాయించింది. నకిలీ వ్యాపారాలు,   ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి 7993822444 వాట్సాప్‌ నంబర్‌కు సమాచారమివ్వాలని సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ గౌతమిసాలి తెలిపారు.

పీడీ యాక్టు నమోదుకు కసరత్తు..  
ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా అప్రమత్తం చేసినా రైతులు నకిలీ విత్తన విక్రయదారుల బారిన పడుతున్నారు. తక్కువ ధరకు కావాలని కోరుకుంటుండటంతో  నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. విత్తనం నాటిన కొన్నాళ్ల తరువాత ఫలితం రాకపోవడంతో అధికారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది వెల్దుర్తికి చెందిన మునిగొండ రత్నాకరరావు పావని సీడ్స్‌ పేరుతో లైసెన్స్‌ లేకుండా విత్తన వ్యాపారం చేస్తుండటంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అతనిపై ప్రివెంటివ్‌ డిటెక్షన్‌(పీడీ చట్టం) యాక్ట్‌ ప్రయోగించారు. కోవెలకుంట్ల మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన నూకల మనోహర్‌రావుపై 14 గుట్కా కేసులు నమోదు కావడంతో గత సంవత్సరం పీడీ చట్టాన్ని ప్రయోగించి జైలుకు పంపారు. ఇదే తరహాలోనే హైదరాబాద్‌కు చెందిన కపీశ్వర్‌ రోటో ప్యాకింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈఓ బొగుడ సురేష్‌పై కూడా పీడీ చట్టం ప్రయోగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇతనిపై పలు స్టేషన్లలో  కేసులున్నాయి. ఈ నేపథ్యంలో నిర్బంధ చట్టం ప్రయోగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

చదవండి: స్మార్ట్‌ కిల్లర్స్‌.. రక్తం చుక్క బయట పడకుండా..   
టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌.. ఏమైందో తెలియదు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top