మదనపల్లె డబుల్‌ మర్డర్‌: భూతవైద్యుడి ఎంట్రీ.. కేసు కీలక మలుపు

New Twist In Madanapalle Two Children Assassination Case - Sakshi

భూత వైద్యుడి వివరాలతో జంట హత్యల కేసులో కొత్తమలుపు

సబ్‌జైలులో పద్మజ, పురుషోత్తంను పరీక్షించిన వైద్యులు 

మానసిక స్థితి సక్రమంగా లేదని వెల్లడి 

సాక్షి, మదనపల్లె : మదనపల్లె జంట హత్యల కేసు కొత్తమలుపులు తిరుగుతోంది. దీనిపై బుధవారం రాత్రి స్థానిక బుగ్గకాలువకు చెందిన భూత వైద్యుడు సుబ్బరామయ్య మీడియాతో మాట్లాడారు. తాను దుర్గమ్మ భక్తుడినని 50 ఏళ్లుగా పలువురికి వైద్యం చేస్తున్నానన్నారు. శనివారం ఉదయం సాయిచిత్ర భాస్కర్, రాజు అనే అన్నదమ్ములు తమ బంధువుల పిల్లలకు చాలా సీరియస్‌గా ఉందని, పురుషోత్తం నాయుడు, పద్మజ ఇంటికి తీసుకు వెళ్లారని తెలిపారు. ఆ సమయంలో పైఅంతస్తులో ఓ అమ్మాయి అరుపులు వినిపించాయని  చెప్పారు.  వాళ్ల అమ్మ వచ్చి తన పిల్లలకు మంత్రించాలని కోరిందన్నారు.


మీడియాతో మాట్లాడుతున్న భూతవైద్యుడు సుబ్బరామయ్య 

వారికి మంత్రించిన తర్వాత  శ్రీ వెంకటరమణ స్వామి గుడి దగ్గర పూజా సామగ్రి, కొబ్బరి కాయలు, తాయత్తులు తీసుకొచ్చామని వెల్లడించారు. తిరిగి వారి ఇంటికి వెళ్లే సరికి ఎవరో ఓ సన్నటి వ్యక్తి అమ్మాయిల దగ్గర కూర్చొని చెవిలో శంఖం ఊదడం చూసినట్లు తెలిపారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చేసినట్లు విలేకరులకు వివరించారు. మంత్రించినందుకు తనకు రూ.300 ఇచ్చారన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఈ హత్యలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మానసిక వ్యాధే కారణం! 
సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితురాలు పద్మజ సబ్‌జైలు గదిలో పూజలు చేసుకుంటూ తనదైన ధ్యాసలో ఉందని జిల్లా ఆస్పత్రి సైకియాట్రిస్ట్‌ రాధిక తెలిపారు. ఆమె మానసికస్థితి సక్రమంగా లేకపోవడంతో జైలు అధికారులు స్పెషల్‌ బ్యారక్‌లో ఉంచారు. పురుషోత్తం నాయుడును మాత్రం ఇతర ఖైదీలతో సాధారణ బ్యారక్‌లో పెట్టారు. వారు మంగళవారం రాత్రి నిద్రపోకుండా ఓం నమశ్శివాయ అంటూ ధ్యానం చేస్తూ కీర్తనలు ఆలపించారని జైలు సిబ్బంది తెలిపారు.


నిందితుల మానసిక స్థితిని వివరిస్తున్న డాక్టర్‌ రాజారావు 

సూపరింటెండెంట్‌ రామకృష్ణ యాదవ్‌ కోరిక మేరకు వైద్యనిపుణులు రాధిక, లక్ష్మీప్రసాద్‌. బీవీ రాజారావు సబ్‌జైలుకు చేరుకుని పద్మజ, పురుషోత్తం నాయుడు దంపతులను పరీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ లోక కల్యాణం కోసమే తమ పిల్లలు చనిపోయినట్లు పురుషోత్తం నాయుడు చెప్పారన్నారు. బిడ్డలు పోయారన్న బాధ ఉన్నప్పటికీ త్వరలోనే తమకు సంతోషం కలుగుతుందన్నారని తెలిపారు. పద్మజ మాత్రం ‘‘నేనే శివుడ్ని.. నా పిల్లలను బతికించుకుంటా’’ అంటూ ధ్యానం చేస్తోందని చెప్పారు. నిందితులు తీవ్రమైన మానసిక వ్యాధి ‘డెల్యూషన్‌’తో బాధపడుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ వ్యాధిగ్రస్తులు తమకు తామే ఓ కొత్త లోకాన్ని ఊహించుకుని అదే నిజమనే భ్రమలో బతికేస్తుంటారని వివరించారు.

ఊహాతీత ఆలోచనలతోనే వారు కన్నబిడ్డలను చంపుకున్నారని తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స చేయాలంటే మూలాలను అన్వేషించాలని, దీనిపై ఓ అంచనాకు వచ్చేందుకు వైజాగ్‌ లేదా తిరుపతిలోని సైకాలజిస్ట్‌ బృందం వద్దకు వీరిని పంపించాలని అధికారులకు సూచించామన్నారు. నిందితుల మానసికస్థితి సక్రమంగా లేకపోయినా శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. వైద్యుల సూచన మేరకు నిందితులను తిరుపతి రుయాకు తరలించేందుకు అనుమతి మంజూరు చేయాలని జైలు సూపరింటెండెంట్‌ బుధవారం కోర్టుకు విన్నవించారు. చదవండి: (చిత్తూరు జిల్లాలో దారుణం..)

(ఇంకా మూఢత్వంలోనే.. తానే శివుడు, అవంతికనంటూ)

(బంగారు తల్లులను చంపేసుకున్నాం.. సారీ డాడీ!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top