‘అమ్మా.. అమ్మా’ అని కేక వేసే లోగానే దారుణం జరిగిపోయింది

Mother Dead At Accident Due To Train Infront Of Son Srikakulam - Sakshi

సాక్షి,వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం): పూండి రైల్వే స్టేషన్‌.. విశాఖ ఎక్స్‌ ప్రెస్‌ సిగ్నల్‌ లేక స్టేషన్‌లో ఆగి ఉన్న సమయం. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపై తొమ్మిదేళ్ల కుర్రాడు వికాస్‌ నించుని ఉన్నాడు. అతడి పక్కన ఒక హ్యాండ్‌ బ్యాగ్‌.. కొంత లగేజీ ఉంది. అప్పటి వరకు ఆ కుర్రాడి కళ్లెదుటే ఉన్న తల్లి ఒకే ఒక్క నిమిషంలో విగతజీవిగా మారిపోయింది. కొడుకు చూస్తుండగానే ట్రై న్‌ ఢీకొని ఆమె దేహం తునాతునకలైపోయింది. అంతటి విషాదాన్ని చూసిన ఆ పసి హృదయం తల్లడిల్లిపోయింది. పూండి స్టేషన్‌ వద్ద సోమవారం రైలు ఢీకొని వజ్రపుకొత్తూరుకు చెందిన వీఆర్‌ఏ బోకర్ల చందన(30) అక్కడికక్కడే మృతి చెందారు.

చదవండి: భర్త దుర్మార్గం...విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చందన తన కుమారుడితో విశాఖలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో పలాస వరకు టికెట్‌ తీసుకున్నారు. అయితే పూండి రైల్వే స్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌కు సిగ్నల్‌ ఇవ్వని కారణంగా కాసేపు బండి ఆగిపోయింది. దీంతో ఇక్కడ దిగితే ఇంటికి వేగంగా వెళ్లిపోవచ్చని భా వించిన చందన కుమారుడు వికాస్‌తో కలిసి రైలు దిగిపోయారు. రైలు పట్టాలు దాటుకుంటూ ప్లాట్‌ఫారం ఎక్కేందుకు ప్రయత్నించారు. లగేజీ బ్యాగ్‌తో పాటు కొడుకును ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫారంపైకి ఎక్కించారు.

ఆమె ఇంకా కిందే ఉండగా అదే పట్టాల మీదుగా చెన్నై మెయిల్‌ 110 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వచ్చింది. పక్క ట్రైన్‌లో ఉన్న వారంతా కేకలు వేస్తున్నా ఆమెకు వినిపించకపోవడంతో ఆమె ప్లాట్‌ఫారం ఎక్కేలోపే రైలు ఢీకొట్టేసింది. కొడుకు ‘అమ్మా.. అమ్మా’ అని కేక వేసే లోగానే మృత్యువు ఆమెను కబళించేసింది. ప్లాట్‌ఫారంలో ఉన్న వారంతా అక్కడకు చేరుకుని స్టేషన్‌ మాస్టర్‌ సుందరంకు సమాచారం అందించారు. మృతురాలి కుమారుడిని పూండి రైల్వేస్టేషన్‌లోనే ఉంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలి భర్త ప్రసాదరావు సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కె.గోవిందరావు పరిశీలించగా స్టేషన్‌ మాస్టర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top