మహిళతో వివాహేతర సంబంధం; ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలని..

Missing Case Turned As Assasinate Case In Vizianagaram - Sakshi

అడ్డుగా ఉన్నాడని హతమార్చారు

పాఠశాలకు వెళ్లే తన చెల్లెను పెళ్లి చేసుకుంటానంటే అడ్డగింత

ఇది మనసులో పెట్టుకుని యువకుడి హత్యకు ప్లాన్‌

సహకరించిన తల్లితో సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి

వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ

వివరాలు వెల్లడించిన విజయనగరం పట్టణ డీఎస్పీ అనిల్‌ కుమార్‌

విజయనగరం క్రైమ్‌: విజయనగరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో మూడు నెలల కిందట నమోదైన అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. సారిక గ్రామానికి చెందిన బొద్దూరు పవన్‌కుమార్‌ (17) అదృశ్యం కేసులో సంచలన విషయాలు తేలాయి. అతడు హత్యకు గురయ్యాడని తేలింది. ఈ హత్యలో పాల్గొన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. కేసు వివరాలను జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో పట్టణ డీఎస్పీ అనిల్‌కుమార్‌ తెలిపారు.

తన కుమారుడు పవన్‌కుమార్‌ మే 8వ తేదీన సాయంత్రం పాలప్యాకెట్లు తెచ్చేందుకు ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదని మే 9న తల్లి లత పోలీసులకు ఫిర్యాదుచేసింది. అదృశ్యం కేసుగా నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జూలై 27వ తేదీన  సారిక గ్రామానికి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో ఓ మృతదేహాన్ని గుర్తించగా అది పవన్‌దిగా నిర్ధారించి దర్యాప్తు చేయగా పలు షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పక్కా స్కెచ్‌తో...  
పవన్‌కుమార్‌ తండ్రి చనిపోయాడు. ఈ క్రమంలో తల్లి లతకు పద్మనాభ మండలం చిన్నాపురానికి చెందిన గిడిజాల జగదీశ్‌తో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై పవన్‌ పలుమార్లు తల్లిని మందలించాడు. జగదీశ్‌ను సైతం హెచ్చరించినా వినకుండా వారి బంధం కొనసాగుతోంది. ఇదిలాఉండగా.. సారిక గ్రామానికి చెందిన వాలిపల్లి సురేశ్‌ (33)తో పవన్‌కు మంచి స్నేహం ఉంది. సురేశ్‌ కన్ను పవన్‌ చెల్లిపై పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు.

దీనికి పవన్‌తో పాటు తల్లి నిరాకరించారు. పాఠశాలకు వెళ్తున్న చిన్నపిల్ల కావాల్సి వచ్చిందా అంటూ మందలించారు. ఆ అమ్మాయి మీద ప్రేమతో సురేశ్‌ లతతో వివాహేతర సంబంధం ఉన్న జగదీశ్‌ను సంప్రదించాడు. ఇద్దరూ ఏకమై పవన్‌ను చంపితే తమ లక్ష్యాలు నెరవేరుతాయని భావించారు. పవన్‌ హత్యకు తనవద్ద పనిచేస్తున్న సువ్వాడ శంకరరావును సురేశ్‌ సాయం కోరాడు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పిట్టా శంకర్, మరో స్నేహితుడు మేకల సోముల సాయంతో హత్యకు పథకం సిద్ధం చేశాడు.


వివరాలు వెల్లడిస్తున్న  డీఎస్పీ అనిల్‌కుమార్‌, సీఐ మంగవేణి, ఎస్‌ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, కిరణ్‌ కుమార్‌నాయుడు, ప్రశాంత్‌ కుమార్

అయితే మే 8వ తేదీన పవన్‌కు డబ్బులు అవసరమై సురేశ్‌ను రూ.2 వేలు అప్పు అడిగాడు. సురేశ్‌ రూ.వెయ్యి ఇచ్చి మిగతా వెయ్యి సాయంత్రం ఇస్తానని చెప్పాడు. ఈ విషయాన్ని శంకర్‌కి సురేశ్‌ చెప్పగా ఇదే అదును అని సారిక గ్రామ సమీపంలో కల్లు తాగే ప్రదేశం వద్ద మేకల సోములు, పిట్టా శంకర్‌లను తాళ్లు, ప్లాస్టిక్‌ గోనె సంచెతో  పవన్‌ను హతమార్చేందుకు సిద్ధంగా ఉంచారు. సాయంత్రం కావడంతో రూ.వెయ్యి కోసం పవన్‌ ఫోన్‌ చేయగా సురేశ్‌ సువ్వాడ శంకర్‌తో కలిసి ముగ్గురూ ఒకే వాహనంపై కల్లుతాగే ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే కాపు కాస్తున్న సువ్వాడ శంకర్‌ బైక్‌ దిగుతుండగానే కర్రతో పవన్‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో పవన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

మృతదేహాన్ని కనిపించకుండా సోములు, పిట్టా శంకర్‌ గోనె సంచిలో మూట కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో వేశారు. బైక్‌ను కూడా తాళ్లతో బావిలో పడేశారు. అయితే పవన్‌ ఇంటికి రాకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే కొన్ని క్లూలతో హంతకులు వాలిపల్లి సురేశ్‌, సువ్వాడ శంకరరావు, మేకల సోములు, పిట్టాశంకర్, గిడిజాల జగదీశ్‌ చిక్కారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం కోర్టుకు తరలించారు. కేసు ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన రూరల్‌ సీఐ మంగవేణి, ఎస్‌ఐలు నారాయణరావు, అశోక్‌కుమార్, గంట్యాడ ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌నాయుడు, సీసీఎస్‌ ఎస్‌ఐ ప్రశాంత్‌ కుమార్, ఏఎస్‌ఐ త్రినాథరావు, హెచ్‌సీలు శ్యామ్‌బాబు, రామారావు, సిబ్బంది షేక్‌ షఫీ, కోటేశ్వరరావు, రమణ, సాయిలను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు పోత్సాహక బహుమతులను అందజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top