పెళ్లి చేసే వయస్సు రాలేదని..

Minor Girl Suicide In Nalgonda District - Sakshi

నల్గొండ : ప్రేమించిన ప్రియుడు దక్కడేమో అన్న ఆందోళనలో ఓ బాలిక పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలగిరి మండలం నాగార్జునపేటతండాకు చెందిన ఆంగోతు పాప, కమిలి దంపతులు హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. కుమార్తె ఆంగోతు ఇందు(14) అలియాస్‌ అమ్ములు దేవరకొండకస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.

ఇదే గ్రామానికి చెందిన బాణావత్‌ శ్రీను మంగ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మొదటి కుమారుడు బాణావత్‌ వినోద్‌(20) దేవరకొండ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదిలా ఉండగా కరోనాతో పాఠశాలలు మూతబడటంతో పాప, కమిలి దంపతులు తమ కూతురు ఇందును తీసుకుని బత్తాయి పనులకు వెళ్లేవారు. వినోద్‌ది కూడా అదే గ్రామం కావడంతో వారితో పాటే కూలి పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో వినోద్, ఇందు మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. 

పెళ్లి చేసే వయస్సు రాలేదని..
వినోద్, ఇందుల ప్రేమ విషయం కొన్ని నెలల క్రితం పెద్దలకు తెలిసింది. దీంతో వినోద్‌ తల్లిదండ్రులు మూడు మాసాల క్రితం పాప, కమలి దంపతులు వద్దకు వెళ్లి మీ కుమార్తెను మా అబ్బాయికి ఇవ్వాలని అడిగారు. అందుకు వారు తమ కుమార్తెకు ఇంకా పెళ్లి వయస్సు రాలేదని, ఇప్పుడు పెళ్లి చేయలేమని చెప్పారు. దీంతో  కొద్దిరోజులుగా ఇందు తాను కోరుకున్న వాడు దక్కడేమోనని కలత చెందుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. అనంతరం విషయాన్ని పెదనాన్న హరియాకు చెప్పింది.

వెంటనే ఆయన ఇందును నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సోమవారం అదే ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఇందు మరణానికి ప్రియుడే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  మృతురాలి తండ్రి  పాప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందు మనస్తాపంతోనే ఆత్మహత్యకు పాల్పడిందా,  ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top