
సీతానగరం(తూర్పుగోదావరి): ఏమి జరిగిందో ఏమో పెళ్లైన ఏడు నెలలకే ఆమె తన జీవితాన్ని చాలించింది. మండలంలోని సింగవరానికి చెందిన సుంకర ధరణి (19) ఆదివారం తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై కె.శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు తండ్రి గతంలో మరణించగా, తల్లి వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్లింది. మృతురాలు ధరణి అమ్మమ్మ పోకల వెంకటలక్ష్మి వద్ద తన అన్న దుర్గాప్రసాద్‌తో ఉంటోంది.
చదవండి: రెండున్నరేళ్ల క్రితం పెళ్లి.. మహిళ దారుణహత్య.. ఆ ఇంట్లో ఏం జరిగింది?
ఈ ఏడాది మార్చిలో రాపాకకు చెందిన మైలవరపు అంజనేయులతో వివాహం అయింది. రెండు నెలల క్రితం భర్త ఆంజనేయులు కువైట్ వెళ్లాడు. అన్నయ్య దుర్గాప్రసాద్ తాపీ పనిలోకి వెళ్లగా, ఉదయం 11 గంటలకు కార్తిక ఉపవాసం ఉన్న ధరణి తనకు కడుపునొప్పి వస్తోందని అమ్మమ్మకు చెప్పగా పడుకోమని చెప్పింది. అమ్మమ్మ కొంత సమయం తరువాత గదిలోకి వెళ్లగా చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉంది. ఆత్మహత్య చేసుకున్న మనుమరాలను చూసి ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. సమాచారం అందుకున్న ఎస్సై వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శుభశేఖర్ తెలిపారు.