పెళ్లయి నాలుగేళ్లు.. ఎన్నో పంచాయితీలు.. చివరకు..

సాక్షి, ప్రొద్దుటూరు క్రైం (వైఎస్సార్ కడప): స్థానిక దేవాంగపేటలో బోదిన మేఘన (22) అనే వివాహిత సోమవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు మేఘనకు 2018లో దేవాంగపేటకు చెందిన శ్రీనివాసులుతో వివాహమైంది. అతను ఎలక్ట్రానిక్ దుకాణంలో గుమాస్తాగా పని చేస్తుంటాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నాయి.
పలుమార్లు ఇరువురి తరపు పెద్ద మనుషులు పంచాయతీ కూడా చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలియడంతో అమృతానగర్‌లో ఉంటున్న తల్లిదండ్రులు రమణమ్మ, మోహన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి విచారించారు. తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.