షేర్‌చాట్‌ ద్వారా పరిచయం.. వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి..

Man Arrested In Woman Murder Case In Guntur District - Sakshi

 డబ్బులు తిరిగి ఇవ్వలేదని హత్య  

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): మహిళ హత్య కేసులో ఒకరిని పట్టాభిపురం పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు అర్బన్‌ జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ తెలిపారు. అర్బన్‌ జిల్లా సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకర్ల సమావేశంలో పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ, పట్టాభిపురం పీఎస్‌ సీఐ ఎస్‌.వి.రాజశేఖర్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్‌ వెల్లడించారు. గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి గుడి రోడ్డులో నివసించే ఎన్‌.కోటేశ్వరి ఈనెల 19న ఇంట్లో హత్యకు గురైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పట్టాభిపురం పీఎస్‌ సీఐ ఎస్‌.వి.రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం బూర్గుంపాడు మండలం అంజనాపురానికి చెందిన జి.అఖిల్‌ అలియాస్‌ నాయక్‌కు కోటేశ్వరి మూడు నెలల కిందట షేర్‌చాట్‌ యాప్‌ ద్వారా పరిచయమైంది.

చదవండి: తిరుపతిలో వింత ఘటన.. చూసేందుకు ఎగబడుతున్న జనం

వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి, మరింతగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో అఖిల్‌ను కోటేశ్వరి డబ్బులు కావాలని అడిగింది. మిర్చి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో రూ.79 వేలు కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెకిచ్చాడు. డబ్బుల విషయమై అఖిల్‌ను కుటుంబ సభ్యులు అడిగారు. అతను కోటేశ్వరిని తిరిగి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈనెల 19న గుంటూరు వస్తే డబ్బులు ఇస్తానని కోటేశ్వరి అతనితో చెప్పింది. 19న అతను ఇంటికి వచ్చి ఆమెతో మధ్యాహ్నం వరకు ఉన్నాడు. అనంతరం బంగారం కొందామని ఆమె అతనితో కలసి శంకర్‌విలాస్‌ సెంటర్‌కు చేరుకున్నారు.

పాత జుంకీల రిపేరు, చంప సవరాలకు రూ.50 వేలు అవుతాయని దుకాణదారుడు చెప్పగా, మరలా డబ్బులు సర్దుబాటు చేయాలని అతన్ని అడిగింది. మరలా వస్తామని దుకాణదారునికి చెప్పి బయటకు వచ్చారు. అనంతరం ఓ చీర కొనుగోలు చేసి ఇంటికి వచ్చారు. డబ్బులు విషయమై వారి మధ్య వాదన జరిగింది. అఖిల్‌ కోటేశ్వరి తలను నేలకేసి పలుసార్లు కొట్టి, అనంతరం గొంతు నొక్కి హత్య చేశాడు. తదుపరి ఉంగరం, చెవిబుట్టలు, ఫోన్లతో ఉడాయించాడు. స్వస్థలానికి చేరుకున్న అతను దొంగిలించిన బంగారపు సొత్తుని పాల్వంచలోని ఓ ఫైనాన్స్‌లో తనఖా పెట్టి రూ.72 వేలు తీసుకున్నాడు.

ఆ నగదుని కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. సాంకేతిక పరిజ్ఞానం, ఫోన్ల ఆధారంగా గురువారం గుంటూరులో అఖిల్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేశారు. సమావేశంలో పశ్చిమ డీఎస్పీ కె.సుప్రజ, పట్టాభిపురం పీఎస్‌ సీఐ ఎస్‌.వి.రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ షేక్‌.అబ్దుల్‌రెహ్మాన్, హెచ్‌సీ బీవీకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.ఉమమహేష్, ఎం.అశోక్, బి.హనుమంతరావు, టి.విశ్వేశ్వరరావు అభినందించారు.

అఖిల్‌ షేర్‌చాట్‌ ద్వారా పలువురిని మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. గతంలో పోలీస్‌ అని చెప్పి మోసగించగా ఖమ్మం జిల్లా కూసుమంచి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో అతన్ని అరెస్ట్‌ చేసి జైలుకి పంపించగా, బెయిల్‌పై విడుదలై వాయిదాలకు తిరుగుతున్నాడు. షేర్‌చాట్‌ యాప్‌ ద్వారా తెలియని వ్యక్తులతో ఛాటింగ్‌ చేయవద్దని అర్బన్‌ ఎస్పీ సూచించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top