ఇదో రియల్‌ సస్పెన్స్‌ కథ: బెడ్‌రూమ్‌లోని రూ.55 లక్షలు మాయం!

Looted Rs 55 lakh From bedroom Bheemili - Sakshi

తగరపువలస (భీమిలి): ఇదో రియల్‌ సస్పెన్స్‌ కథ. బెడ్‌రూమ్‌లో పాతిపెట్టిన రూ.55 లక్షలు మాయమయ్యాయని ఓ ఆసామి ఫిర్యాదు చేయడం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగటం.. ఆ వెనుకే క్లూస్‌టీమ్‌.. తరువాత డాగ్‌ స్క్వాడ్‌ రావడం.. పలుచోట్ల తవ్వకాలు జరపటం.. సోదాలు చేయటం.. ఎదురింట్లో రూ.19 లక్షలు లభించటం వంటి పరిణామాలు రోజంతా కనిపించాయి. సీన్‌ కట్‌చేస్తే.. ఉన్నట్టుండి ‘మేమూ.. మేమూ.. పరిష్కరించుకుంటాం. ఇక మీరు వెళ్లి రావొచ్చు’ అని ఆ ఆసామి చెప్పటం.. మారుమాట్లాడకుండా పోలీసులు వెనుదిరగడం జరిగిపోయాయి. భీమిలి జోన్‌ రెండో వార్డు సంగివలసలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటున్న మేడ చిన్నారావు అలియాస్‌ గురుమూర్తి కర్ర పెండలం వ్యాపారం చేస్తుంటాడు.

ఈ ఏడాది మార్చిలో విజయనగరం జిల్లా గజపతినగరంలో భూమి విక్రయించగా రూ.75 లక్షలు వచ్చాయి. అందులో రూ.20 లక్షలు బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షల్ని డబ్బాలో ఉంచి బెడ్‌రూమ్‌లో గొయ్యి తీసి పాతిపెట్టాడు. ఆపై సిమెంట్‌తో ప్లాస్టింగ్‌ చేయించాడు. ఈ నెల 17న ఇద్దరు కుమారులు, కోడళ్లు అత్తారింటికి వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా డబ్బులు పాతిపెట్టిన చోట కొత్తగా సిమెంట్‌ ప్లాస్టింగ్‌ చేసి ఉండటంతో కంగారుపడి అక్కడ తవ్విచూశారు. డబ్బులు కనిపించకపోవడంతో అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించారు. దీంతో క్రైమ్‌ విభాగం క్లూస్‌ టీమ్‌ వచ్చి సోమవారం సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను విచారించారు.

పోలీసులు వచ్చి ఇంట్లో, ఆవరణలో పలుచోట్ల తవ్వి చూశారు. అయినా ప్రయోజనం లేక.. అదే ఇంటికి ఎదురుగా చిన్నారావు (గురుమూర్తి)కే చెందిన పెంకుటింట్లో సోదాలు నిర్వహించగా.. అక్కడ గొయ్యి తీసి దాచిన రూ.19 లక్షలు బయటపడ్డాయి. ఇది ఇంట్లో వాళ్ల పనేనని అనుమానించిన పోలీసులు విచారణ ప్రారంభించగా.. సీన్‌ మారిపోయింది. ఈ సమస్యను తామే పరిష్కరించుకుంటామని ఫిర్యాదుదారు చిన్నారావు చెప్పడంతో పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. రూ.55 లక్షలు మాయమైన భవనంలో ఫిర్యాదుదారు చిన్నారావు నివసిస్తుండగా.. రూ.19 లక్షలు లభ్యమైన ఎదురింట్లో అతని ఇద్దరు కుమారులు ఉంటున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top