పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి

Karimnagar: Ten Year Girl Dies In Road Accident At Thimmapur - Sakshi

ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ.  పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. ఆ బిడ్డకోసం మొక్కని దేవుడు, చేయని పూజలు లేవు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారే ఆ తల్లిదండ్రులకు లోకం. పాపే ప్రాణంగా బతుకుతున్న వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. ముగ్గురు యువకుల మద్యం మత్తు క్రీడకు అభం.. శుభం తెలియని చిన్నారి బలైంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెనకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది.

తిమ్మాపూర్‌(మానకొండూర్‌):పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లోకిని జంపయ్య– రాజేశ్వరీ దంపతులది సొంతూరు ఇందుర్తి. వీరికి కూతురు శివాని(10) ఉంది. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. బతుకుదెరువు కోసం తిమ్మాపూర్‌ వచ్చారు. స్టేజీవద్ద అద్దెకు ఉంటున్నారు. జంపయ్య కూలీపని, రాజేశ్వరి సమీపంలోని ఓ మొబైల్‌ క్యాంటీన్‌లో పనిచేస్తుంటుంది. శివాని శుక్రవారం మధ్యాహ్నం తల్లివద్దకు రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న ఇదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్‌ మద్యంమత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టారు.

తర్వాత కారు సమీపంలోని విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి పోయింది. బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా చని యింది. కారు నడిపిన సంతోశ్, డేవిడ్‌ పరారయ్యారు. శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యంమత్తు, ఓవర్‌స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాదం తరువాత కూడా నిందితులు సమీపంలోని మద్యం దుకాణంలో మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నడిపిన సంతోశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు.
చదవండి: వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top