‘నష్ట పరిహారం అడిగినందుకు నాపై అత్యాచారం చేశారు’

Jharkhand Molested Victim: Accused Raped Me For Demanding Compensation - Sakshi

జార్ఖండ్‌లో 50 ఏళ్ల వితంతువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యాన్ని మహిళ ప్రతిఘటించటంతో ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. జనవరి 7న(గురువార) జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకొని బాధితురాలు ఆదివారం డిశ్చార్జి అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తన మేకను కొట్టినందుకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరినందుకు నిందితులు తనపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ మేరకు ఎస్పీ రిషబ్‌ ఝా మాట్లాడుతూ.. అ‍త్యాచార కేసులో మహిళ స్టేట్‌మెంట్‌ తీసుకున్నామని, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్‌ అఘాయిత్యం

కాగా చత్రా జిల్లాలోని హంటర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 ఏళ్ల వితంతువు తన కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. గురువారం రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్ళటానికి  ఇంటికి కొంత దూరంలోని బహిరంగ ప్రదేశానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నముగ్గురు యువకులు వితంతువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారినుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో వారు ఆమెను హింసించి.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.

బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంత సేపటికి రాక పోయేసరికి కుటుంబ సభ్యులు ఆమెకోసం గాలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను బహిరంగ ప్రదేశంలో గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని హంటర్ గంజ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బీహార్, గయలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొంది ఆదివారం డిశ్చార్జి అయ్యింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top