Divya Hagaragi Arrested: దివ్య మొబైల్‌ ముక్కలు!

Investigation Expedited Arrest Of Sensational SI Scam Divya - Sakshi

బనశంకరి: రాష్ట్ర సర్కారుకు సంకటంగా మారిన ఎస్‌ఐ పోస్టుల పరీక్షల స్కాంలో అరెస్టయిన దివ్య హగరగి అరెస్టు కావడంతో విచారణ వేగమందుకుంది. ఆమెను శనివారం కూడా సీఐడీ అధికారులు విచారించారు. తన మొబైల్‌ఫోన్‌ దొరకరాదని పరారీలో ఉన్నప్పుడే బద్దలు కొట్టినట్లు తెలిసింది. కొద్దిరోజుల కిందటే సీఐడీ అధికారులు దివ్య హగరగిని పూణేలో అరెస్ట్‌ చేశారు. ఆ సమయంలో మొబైల్‌ గురించి విచారించగా ఆమె నోరు మెదపలేదు. శనివారం కలబురిగిలో జరిపిన విచారణలో, ఫోన్‌ను పగలగొట్టినట్లు చెప్పింది. మొబైల్‌లో ఉన్న సాక్ష్యాధారాలు నాశనం చేయడానికే ఇలా చేసినట్లు తెలిసింది. మిగిలిన నిందితుల మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిలో సాక్ష్యాధారాల కోసం శోధిస్తున్నారు. అవసరమైతే దివ్యని మళ్లీ పూణే కు తీసుకెళ్లే అవకాశం ఉంది.  

18 రోజులూ దేవస్థానాల యాత్ర  
దివ్య హగరగి దైవ భక్తురాలు. పరారీలో ఉన్న 18 రోజులు ప్రముఖ ఆలయాలను సందర్శించి పూజలు చేసినట్లు తెలిసింది. ఎస్‌ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి రాగానే ఏప్రిల్‌ 10వ తేదీన మధ్యాహ్నం కలబురిగిలో ఇల్లు విడిచిపెట్టింది. అఫ్జలపుర మీదుగా మహారాష్ట్ర సొల్లాపురకు చేరుకుని అక్కడ మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసుకుంది. తరువాత ఆన్‌ చేయలేదు. పారిశ్రామికవేత్త సురేశ్‌ కాటిగావ సహాయం తీసుకుని ఒక ఫాంహౌస్‌లో రెండురోజులు మకాం వేసింది. సిద్దరామేశ్వర ఆలయం దర్శించి పూణెకి వెళ్లి 5 రోజులు పాటు అక్కడే మకాం వేసింది. తరువాత గుజరాత్‌కు వెళ్లి అక్కడ మూడురోజుల పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసింది. 22వ తేదీ మళ్లీ పుణే కు చేరుకుని అరెస్టయ్యే వరకు రింగ్‌రోడ్డులోని ఒక ఇంట్లో  తలదాచుకుంది.  

పరీక్ష రద్దుపై కాంగ్రెస్‌ నేతల భగ్గు  
ఈ కుంభకోణంలో బీజేపీ నేతలు భాగస్వాములుగా ఉన్నారని, వారిని కాపాడటానికి విచారణ నివేదికకు ముందే పరీక్షను రద్దు చేశారని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. బెంగళూరులో మాట్లాడుతూ దివ్య హగరగిని అరెస్ట్‌ చేసి తీసుకువస్తుండగానే పరీక్ష రద్దును హోంమంత్రి ప్రకటించారన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ పరీక్షలో ఉత్తీర్ణులై పోస్టు కోసం వేచిచూస్తున్న అభ్యర్థులు డీకేని కలిశారు. నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తీర్ణులైన తమకు ఎందుకు శిక్ష అని వాపోయారు. ఫ్రీడంపార్క్‌ వద్ద ధర్నా చేపట్టారు. 

మళ్లీ ఎస్‌ఐ పరీక్ష జరపాలని ప్రభుత్వం ఏ ఆధారంతో నిర్ణయించిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ప్రశ్నించారు. హోంమంత్రి ని తొలగించాలని డిమాండ్‌ చేశారు. కింగ్‌పిన్‌ దివ్యహగరగి అరెస్టైన తక్షణం పరీక్ష రద్దు నిర్ణయం తీసుకోవడం వెనుక రహస్యమేమిటన్నారు. నిజాయితీగా పరీక్ష రాసినవారికి న్యాయం చేయాలన్నారు.   ఎస్‌ఐ స్కాంలో హోంమంత్రి అరగజ్ఞానేంద్ర పాత్ర ఉందని కాంగ్రెస్‌ నేత దినేశ్‌గుండూరావ్‌ ఆరోపించారు.

రూ.3 లక్షలతో ఇంటి నుంచి పరారు  
పారిపోయే ముందు రూ.3 లక్షలు తీసుకుని వెళ్లిన దివ్య ఎక్కడా ఏటీఎంలో నగదు డ్రా చేయలేదు. ఇలా దొరకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. దివ్య కుటుంబ నేపథ్యం గమనిస్తే చాలా శ్రీమంతులు. అనేక స్కూళ్లు, కాలేజీలు, వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కలబురిగి చుట్టుపక్కల కోట్లాదిరూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. రాజకీయంగా మంచి పేరు కలిగి ఉంది. డబ్బు సంపాదనకు, పలుకుబడిని చాటుకోవడానికి ఎస్‌ఐ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిందని అనుమానాలున్నాయి.

(చదవండి: ఎస్‌ఐ పరీక్షలో అక్రమాలు.. హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top