విషాదం: రెండేళ్ల క్రితం భర్త.. ఇప్పుడు కుమార్తె..

Inter Student Commits Suicide In East Godavari - Sakshi

కాకినాడ క్రైం(తూర్పుగోదావరి): కాకినాడలో ఓ ఇంటర్మీడియెట్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య కళాశాలలో చదువుతున్న సంగాడి శాంతి(17) శనివారం అర్థరాత్రి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లరేవు మండలం గాడిమొగకు చెందిన శాంతి కాకినాడ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. లక్ష్మీనారాయణ నగర్‌ చైతన్య బాలికల క్యాంపస్‌ హాస్టల్‌లో ఉంటోంది.

చదవండి: కామాంధుడు.. తినుబండారాలు కొనిపెడతానని ఇంటికి తీసుకెళ్లి..

తనకు ఆరోగ్యం బాగుండటంలేదని శనివారం తల్లితో ఫోన్‌లో చెప్పి బాధపడింది. క్యాంపస్‌కు రావాలని కోరింది. అందుకు తల్లి రేపు వస్తానంటూ చెప్పి కూతుర్ని సముదాయించింది. ఈ క్రమంలో శాంతి శనివారం రాత్రి ముభావంగా ఉంది. స్నేహితులు భోజనానికి పిలిచినా వెళ్లలేదు. దీంతో వారే ఆమెకు మెస్‌ నుంచి భోజనం తీసుకొచ్చారు. ఆపై వారు చదువుకోవడం కోసం పక్క గదుల్లో ఉన్న స్నేహితుల వద్దకు వెళ్లారు. చదువు ముగించుకొని తిరిగి గదికి వచ్చి చూసే సరికి గదిలో ఫ్యానుకు శాంతి ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. భయపడ్డ రూంమేట్లు వార్డెన్‌కు విషయం చెప్పారు. సెక్యూరిటీ గార్డు వచ్చి ఆమెను దించాడు. కళాశాల యాజమాన్యం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు నిర్ధారించారు.

చదువులో మేటి... 
శాంతి చదువులో ఉన్నతంగా రాణిస్తోంది. రిలయన్స్‌ సంస్థ అందిస్తున్న ప్రతిభావంతుల స్కాలర్‌షిప్‌తో కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీ చదువుతోంది. తను చదవడంతో పాటు తోటి స్నేహితులకు సబ్జెక్టుకు సంబంధించిన సమస్యలను సునాయాసంగా అర్థమయ్యేరీతిలో వివరించి చెప్పేదని స్నేహితులు వాపోయారు. కూతురే ప్రపంచం అంటూ బతుకుతున్న శాంతి తల్లి ధనబుజ్జి పరిస్థితి దయనీయంగా ఉంది. కాకినాడ జీజీహెచ్‌లో కుమార్తె మృతదేహాన్ని చూసి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది.

చేపల వేటతో ఇంటిని పోషిస్తున్న భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో ధనబుజ్జి రోడ్డున పడింది. మనో ధైర్యంతో ముందడుగు వేసి జీవనోపాధి కోసం నాలుగిళ్లల్లో ప నులు చేసుకుంటూ కష్టపడి కుమార్తెను చదివించింది. తల్లి కష్టాన్ని కళ్లారా చూసిన శాంతి అందుకు తగ్గ రీతిలో చదువులో రాణిస్తూ రిలయన్స్‌ స్కాలర్‌షిప్‌నకు అర్హత సాధించింది. తానే ఇంటి పెద్దననీ, పరిస్థితులకి భయపడొద్దని తన తమ్ముడికి ధైర్యం చెప్పి తాను ఉసురు తీసుకుందంటూ ధనబుజ్జి గుండెలవిసేలా రోదించిన తీరు చూపరుల కళ్లు చమర్చేలా చేశాయి.

అనుమానాస్పద మృతిగా కేసు 
తన కుమార్తె కొన్నాళ్లుగా సాధారణ ఆస్తమాతో బాధపడుతోందని తల్లి ధనబుజ్జి పోలీసులకు తెలిపింది. తనను ఆదివారం రమ్మని చెప్పి ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదని అంది. ఇదే విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు కాకినాడ టూ టౌన్‌ సీఐ పెద్దిరెడ్డి రామచంద్రరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జీజీహెచ్‌లో శాంతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిందన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top