Hyderabad: ప్రేమ పేరుతో వేధింపులు.. నడిరోడ్డుపై మహిళపై దాడి

Hyderabad: Ex Lover Attack On Woman At Hafiz Baba Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది.  ఓ యువకుడు ప్రేమ పేరిట వివాహితను వేధిస్తూ.. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడికి తెగబడ్డాడు.  ఈ ఘటన కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చొని ఉన్న నూరు భాను అనే మహిళపై కత్తితో దాడి చేశాడు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళ వెనుక నుంచి విచక్షణ రహితంగా కత్తితో పొడిచి గాయపరిచాడు. రోడ్డుపై అంత ఘోరం జరుగుతున్నా ఎవరూ అడ్డుకోకపోవడం బాధించే విషయం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా  ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని హబీబ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సంతోష్‌ నగర్‌ ఏసీపీ శ్రీనివాస్‌ వెల్లడించారు.  ‘కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎ–బ్లాక్‌ ప్రాంతానికి చెందిన నూర్‌ భాను (40) భర్త ఇంతియాజ్‌ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. ప్రస్తుతం నూర్‌ భాను కుమారుడితో కలిసి నివాసముంటోంది. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన షేక్‌ నసీరుద్దీన్‌ ఆలియాస్‌ హబీబ్‌ (32) ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు.  శుక్రవారం మధ్యాహ్నం నూర్‌ భాను ఉమర్‌ రెస్టారెంట్ ముందుకు రాగానే.. షేక్‌ నసీరుద్దీన్‌ వెనుక నుంచి యాక్టివా ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె ముఖం, చేతులు, ఇతర ప్రాంతాల్లో కత్తితో దాడి చేశాడు. బాధితురాలు అక్కడే స్పృహ కోల్పోయింది.
చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. ఇల్లు అద్దెకు ఇస్తానంటూ యువతిని బంధించి..

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే మహిళను ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. నిందితుడిని పట్టుకోవడానికి అయిదు బృందాలు ఏర్పాటు చేశాం. గతంలోనూ హబీబ్‌పై నూర్‌ భాను ఫిర్యాదు చేసింది. 2021లో కేసు నమోదు చేసి హాబీబ్‌ను అరెస్ట్ చేశాం’ అని ఏసీపీ పేర్కొన్నారు. అదే విధంగా చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ బాధితురాలిని పరామర్శించి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని హామీ ఇచ్చిధైర్యం చెప్పారు.
చదవండి: నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top