బ్యాగ్‌లో డైమండ్‌ బ్రాస్‌లైట్, 35 వజ్రాలు.. పార్క్‌ హయత్‌లో చోరీ జరిగిందా? మర్చిపోయారా?

Hyderabad Diamond Jewellery Found at Park Hyatt Banjara Hills - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ముంబై నుంచి వచ్చిన ఓ వ్యాపారి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో మర్చిపోయిన ఆభరణాల బ్యాగును బంజారాహిల్స్‌ పోలీసులు గుర్తించారు. అటు పంజగుట్ట, ఇటు బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు ఈ ఆభరణాల మిస్సింగ్‌ విషయంలో హైరానా పడుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు బంజారాహిల్స్‌ పోలీసులు దీన్ని ఛేదించారు.

వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన అహ్మద్‌ బేగ్‌ అనే వ్యాపారి తన భార్యతో కలిసి గతనెల 22వ తేదీన బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బస చేశారు. గత నెల 24వ తేదీన హోటల్‌లో ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ బస చేయడంతో వీవీఐపీ తాకిడి ఎక్కువ కావడం, సేవలు సరిగ్గా లేకపోవడంతో బేగ్‌ ఇక్కడి నుంచి ఖాళీ చేసి సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌కు వెళ్లాడు. పార్క్‌ హయత్‌ నుంచి ఖాళీ చేసే క్రమంలో ఆయన భార్య తన ఆభరణాల బ్యాగును లిఫ్ట్‌ వద్ద ఉన్న సర్వీస్‌ ఫోన్‌ టేబుల్‌పై ఉంచి మర్చిపోయింది.

పార్క్‌ హోటల్‌కు వెళ్లాక చూసుకోగా ఆభరణాల బ్యాగు కనిపించలేదు. వెంటనే బేగ్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చోరీ జరిగిందన్న నేపథ్యంలో సీసీ ఫుటేజీలు, అనుమానితుల కదలికలను పరిశీలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో బాధితుడు ఈ నెల 1వ తేదీన పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోగొట్టుకున్న బ్యాగులో డైమండ్‌ బ్రాస్‌లైట్, 35 డైమండ్లు, డైమండ్‌ రింగ్, మంగళసూత్రం, బంగారు గొలుసు, చెవి దిద్దులు ఉన్నాయని వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే మంగళవారం బంజారాహిల్స్‌ క్రైం పోలీసలు మరోసారి పార్క్‌హయత్‌ హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. అయితే లిఫ్ట్‌ వద్ద ఉన్న టెలీఫోన్‌ స్టూల్‌ బంగారు వర్ణంలో ఉండటం, ఆభరణాల బ్యాగు కూడా అదే రంగులో ఉండటంతో దాన్ని ఎవరూ గుర్తించలేదు. దీంతో పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వారం రోజుల నుంచి ఆభరణాల బ్యాగు అక్కడే ఉండటాన్ని ఎవరూ నమ్మడం లేదు. పార్క్‌హయత్‌ హోటల్‌ నిర్వాకంపై గతంలోనే ఎన్నో విమర్శలు వచ్చాయి. పోలీసులు తనిఖీలు చేస్తున్న విషయాన్ని తెలుసుకొని అప్పటికప్పుడు ఈ బ్యాగును అక్కడ ఉంచి నాటకానికి తెరలేపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ జరిగిందా..? మర్చిపోయారా అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top