నిద్రమత్తులో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి..ఆపై భర్త కూడా.. | Sakshi
Sakshi News home page

నిద్రమత్తులో ఉన్న భార్యపై గొడ్డలితో దాడి..ఆపై భర్త కూడా..

Published Sat, Dec 10 2022 9:43 AM

Husband Killed Wife With Axe He Attempt Suicide At Sultanpuri - Sakshi

సాక్షి, పరిగి: నిద్రమత్తులో ఉన్న భార్యను గొడ్డలికామతో తలపై కొట్టి హత్య చేసి.. ఆపై దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కావలి భీమయ్య (55) కావలి పెంటమ్మ(50) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వీరి వివాహం చేసి అత్తవారిళ్లకు పంపించారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా భీమయ్య మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో వైద్యం చేయిస్తున్నారు. ఎప్పటిలాగే దంపతులిద్దరూ గురువారం రాత్రి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు. ఈ సమయంలో పెంటమ్మ నిద్రలోకి జారుకోగా భీమయ్య లేచి గొడ్డలి కామతో ఆమె తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య చనిపోయిందనే భయంతో భీమయ్య కూడా దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీ పనికి తీసుకెళ్లేందుకు పెంటమ్మ వద్దకు వచ్చిన గ్రామస్తులు తలుపులు గడియ పెట్టి ఉండటాన్ని గమనించారు.

ఎన్నిసార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. అందరూ వచ్చిన తర్వాత గడియ పగలగొట్టి చూడగా.. పెంటమ్మ రక్తపు మడుగులో పడి ఉంది. భీమయ్య దూలానికి వేలాడుతూ కనిపించాడు. వీరి పెద్ద కూతురు కృష్ణవేణి అత్తవారి ఇంటి వద్ద జరుగుతున్న భూవివాదాల నేపథ్యంలో మృతులు కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే భీమయ్య మతిస్థిమితం కోల్పోయినట్లు సమాచారం. కూతురు కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.    

(చదవండి: మన్నెగూడ కేసు: రహస్య ప్రాంతంలో వైశాలి.. జాడలేని నవీన్‌ రెడ్డి)

Advertisement
 
Advertisement
 
Advertisement