అనుమానిస్తోందని.. హతమార్చాడు 

Husband Assassition Wife In Visakhapatnam - Sakshi

పీక నులిమి భార్యను హత్య చేసిన భర్త 

పద్మనాభంలో దారుణం   

పద్మనాభం (భీమిలి): ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... అనంతరం మనస్పర్థలు పెరిగాయి... భర్త ప్రవర్తనపై అనుమానం పెంచుకుని నిత్యం వేధిస్తుండడం.., విడిపోవాలని నిర్ణయించుకుని భార్య డబ్బులు డిమాండ్‌ చేయడంతో విసిగిపోయిన భర్త ఆమెను హతమార్చాడు. ఈ ఘటన పద్మనాభం మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పద్మనాభం సీఐ ఎ.విశ్వేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం... విజయనగరం పట్టణానికి చెందిన పల్లి నవీన్‌ కుమర్‌ (27), పద్మనాభం మండలం విలాస్‌ఖాన్‌పాలెం గ్రామానికి చెందిన చెల్లూరి సంతోష్‌ స్నేహితులు. సంతోష్‌ కుమార్తె లలిత జన్మదిన వేడుకలకు 2014లో విలాస్‌ఖాన్‌పాలెం వచ్చిన నవీన్‌కు... అక్కడ సంతోష్‌ సోదరి చెల్లూరి పద్మ(25)తో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారడం.., అప్పటికే మేనత్త కుమార్తెతో నవీన్‌కు పెళ్లి చేయాలని అతని తల్లిదండ్రులు నిర్ణయించడంతో వారికి చెప్పకుండా 2015లో సింహాచలంలో పద్మను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అనంతరం పద్మనాభం గ్రామంలో అద్దె ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. నవీన్‌ ఆరిలోవ హెల్త్‌సిటీలోని ఓ ఆస్పత్రిలో ఫార్మాసీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని పద్మ అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో నిత్యం నవీన్‌ ఫోన్‌ పరిశీలిస్తూ అనుమానించేంది. ఈ క్రమంలో ఆదివారం విధులకు వెళ్లి రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి వచ్చిన నవీన్‌కు, పద్మకు మధ్య ఘర్షణ జరిగింది. భర్త ఫోన్‌ తీసుకుని కాల్‌ లిస్ట్‌ పరిశీలించింది. తనను ప్రేమ వివాహం చేసుకుని సరిగా చూడకుండా వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని ఘర్షణకు దిగింది. తనకు రూ.4 లక్షలు ఇచ్చి వదిలేయాలని కోరింది.

అయితే అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేనని, విడతలు వారీగా డబ్బులు ఇస్తానని నవీన్‌ చెప్పాడు. అందుకు నిరాకరించిన పద్మ విజయనగరంలోని మీ తల్లిదండ్రులకు అంతా చెప్పేస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌ కుమార్‌ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో పద్మ పీక నులిమి హతమార్చాడు. అనంతరం తన భార్య కడుపునొప్పితో చనిపోయిందని స్థానికులకు, బావమరిది సత్యనారాయణకి ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. మృతురాలు సోదరుడు సత్య నారాయణ ఫిర్యాదు మేరకు ఏïసీపీ రవి శంకర్‌రెడ్డి ఆధ్యర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు నవీన్‌ పోలీసుల అదుపులో ఉన్నాడని విశ్వసనీయ సమాచారం అధారంగా తెలిసింది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top