ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం 

Housewife Disappear Along With Two Children In Hyderabad - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: ఇద్దరు పిల్లలతో సహా గృహిణి కనిపించకుండాపోయిన సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుప్పాలగూడ కేపీఆర్‌ కాలనీకి చెందిన బాల్‌రెడ్డి, రాధిక(23) భార్యాభర్తలు. వీరికి గౌరీష్‌రెడ్డి(4), రిత్విక్‌రెడ్డి(5 నెలలు) సంతానం. ప్రైవేటు ఉద్యోగి అయిన బాల్‌రెడ్డి సోమవారం ఉదయం డ్యూటీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళం ఉండడంతో భార్య, పిల్లలు బజారుకు వెళ్లి ఉంటారని వేచి చూశాడు. రాత్రి వరకు భార్యాపిల్లలు రాకపోవడం, ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో స్థానిక ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వాకబు చేశాడు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పేటీఎం అప్‌డేట్‌ కేటుగాళ్లకు సంకెళ్లు! 
సాక్షి, హైదరాబాద్‌: పేటీఎం ఖాతాలోని ‘నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ)’ వివరాలు అప్‌డేట్‌ పేరుతో బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు పట్టుకున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రం జమ్తారా, దేవ్‌గఢ్‌లో పట్టుకున్న వీరిని ట్రాన్సిట్‌ వారంట్‌పై మంగళవారం తీసుకొచ్చారు. నిందితుల నుంచి రూ.1,47,000ల నగదుతో పాటు ఆరు సెల్‌ఫోన్లు, రెండు ఆధార్‌ కార్డులు, మూడు డెబిట్‌కార్డులు, ఐదు విద్యుత్‌ బిల్లుల చెల్లింపు కాపీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్‌ డీసీపీ కవిత, సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వి.శ్యాంబాబుతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలిపారు.   

విద్యుత్‌ బిల్లులు చెల్లించి నగదుగా మార్పు... 
ఈజీ మనీ కోసం అలవాటు పడిన జార్ఖండ్‌కు చెందిన నంకు మండల్, రాజేష్‌ మండల్‌లు పేటీఎం అప్‌డేట్‌ పేరుతో బాధితుల ఖాతా నుంచి డబ్బును మొబిక్‌విక్, ఫోన్‌పే,పేటీఎం వ్యాలెట్స్‌కు బదిలీ చేసుకునేవారు.  దానిని నగదు రూపంలోకి మార్చుకునేందుకు శివశక్తికుమార్‌ అలియాస్‌ అమిత్‌ బర్నవల్‌ను కలిశారు. ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లులు చెల్లించేందుకు  మదన్‌ లాల్‌ బజాజ్‌ కు చెందిన రూ.1,60,000 విద్యుత్‌  బిల్లులను గౌరవ్‌ అరుణ్‌ అనే వ్యక్తి శివశక్తికుమార్‌కు అందించాడు. ఇవే బిల్లులను నంకు, రాజేష్‌ మండల్‌లకు ఇవ్వడంతో తమ వ్యాలెట్‌లో ఉన్న కొట్టేసిన డబ్బులతో ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత శివశక్తికుమార్‌ తన 30 శాతం కమిషన్‌ మినహాయించుకొని మిగతా డబ్బులను వీరికి అందించాడు. కాగా, రష్యాలో మెడిసిన్‌ చేసి భారత్‌లో ఎంబీబీఎస్‌ వ్యాలిడిటీ కోసం నిర్వహించే మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో పరీక్షలో ఫెయిల్‌ అయిన గౌరవ్‌ అరుణ్‌ అనే వ్యక్తి 20 శాతం కమిషన్‌ తీసుకొని విద్యుత్‌ బిల్లులను శివశక్తికుమార్‌ ఇచ్చాడు. దిల్‌కుష్‌ కుమార్‌ సింగ్‌ అనే వ్యక్తి నకిలీ బ్యాంక్‌ ఖాతాలను నంకు మండల్‌కు సమకూర్చేవాడు. వీరిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు టెక్నికల్‌ డాటాతో ఐదుగురినీ జార్ఖండ్‌లో పట్టుకొని ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు.

ఇలా మొసగించారు..
‘ఈ ఏడాది సెప్టెంబర్‌  1న డియర్‌ కస్టమర్‌...మీ కేవైసీ సస్పెండ్‌ అయింది. పేటీఎం ఆఫీసు నంబర్‌ 8345989385కు వెంటనే కాల్‌ చేయండి. లేకపోతే 24 గంటల్లో మీ అకౌంట్‌ బ్లాక్‌ అవుతుంది. థ్యాంక్‌ యూ పేటీఎం’ అంటూ సెల్‌ఫోన్‌కు వచ్చిన సంక్షిప్త సమాచారం(ఎస్‌ఎంఎస్‌)కు మియాపూర్‌కు చెందిన బాధితురాలు స్పందించారు. సదరు పేటీఎం ఉద్యోగిగా చెప్పుకున్న సైబర్‌ నేరగాడికి ఫోన్‌కాల్‌ చేశారు. అతడు చెప్పినట్టుగా సెల్‌ఫోన్‌లో టీవ్‌ వీవర్‌ క్విక్‌ సపోర్ట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆ ఐడీ నంబర్‌ను సైబర్‌ నేరగాడికి చెప్పడంతో సెల్‌ఫోన్‌ను ఆపరేట్‌ చేయడం మొదలెట్టాడు. ఆ తర్వాత రూ.1 పేటీఎం వ్యాలెట్‌కు యాడ్‌ చేయమని చెప్పాడు. దీంతో బాధితురాలు పేటీఎం వ్యాలెట్‌కు వెళ్లి  బ్యాంక్‌ ఖాతా వివరాలు పేటీఎంలో ఎంటర్‌ చేశారు. సెకన్లలోనే ఆమె సెల్‌ఫోన్‌కు మీ ఖాతా నుంచి రూ.4,29,360లు డెబిట్‌ అయ్యాయని ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి.  మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సెప్టెంబర్‌ 2న సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు.’   

భారీ డిస్కౌంట్ల పేరుతో రూ.6 లక్షలు స్వాహా 
సాక్షి, హైదరాబాద్‌: తమతో వ్యాపారం చేస్తే భారీ డిస్కౌంట్‌తో ఆయిల్స్‌ సరఫరా చేస్తామంటూ నగర వాసికి ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు రూ.6 లక్షలు కాజేశారు. బాధితుడు సోమవారం రాత్రి సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. హిమాయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన అనిరుద్ధ్‌ అగర్వాల్‌కు ఇండియా మార్ట్‌ అనే ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ నుంచి కాల్‌ వచ్చింది. ఆ సంస్థ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ నంటూ  అజయ్‌ కులారియా అనే ఓ వ్యక్తి మాట్లాడాడు. గుజరాత్‌కు చెందిన శివ ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థ వివిధ రకాలైన ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటోందని, వీరితో కలిసి వ్యాపారం చేస్తే భారీ రాయితీతో వాటిని తీసుకోవచ్చని ఎర వేశాడు. ఇతర వివరాలు కోసమంటూ రాహుల్‌ పటేల్‌ అనే వ్యక్తిని సంప్రదించమని ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. అనిరుద్ధ్‌ అతడితో మాట్లాడటంతో సరుకు విలువలో 50 శాతం ముందు చెల్లిస్తే ఆయిల్‌ పంపుతామని చెప్పాడు. ఇది నమ్మిన బాధితుడు రూ.6 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత నుంచి నేరగాళ్లు స్పందించడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించిన అనిరుద్ధ్‌ బుధవారం రాత్రి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

తొలిసారిగా ఒకే ఒక్క కేసు... 
నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం ఎఫెక్ట్‌ సైబ ర్‌ క్రైమ్‌ బాధితుల పైనా పడింది. ఈ కారణంగానే మంగళ వారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఒకే ఒక్క కేసు న మోదైంది. గడిచిన రెండుమూడేళ్ల కాలంలో ఇలా జరగడం మొదటిసారని అధికారులు చెప్తున్నారు.  పేటీఎం ఖాతాకు సంబంధించిన కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ నగర వాసికి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు అతడి నుంచి రూ.70 వేలు కాజేశారు. బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.  

ఆత్మహత్య చేసుకుంటున్నా... 
సాక్షి, బంజారాహిల్స్‌: తాను ఆ త్మహత్య చేసుకుంటున్నాన ని తండ్రికి మెసేజ్‌ పెట్టి ఓ యువ దర్శకుడు అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటగిరిలోని కమలా నిలయంలో ఒడిశాకు చెందిన దీపక్‌ రంజన్‌ బెహరా(27) అద్దెకుంటున్నాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో భోజనానికి వెళ్తున్నానని స్నేహితుడు సునీల్‌కి చెప్పి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు తన తండ్రి హరిశ్చంద్ర బెహెరా ఫోన్‌కు దీపక్‌ ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్‌ పెట్టాడు. తనకు రూ. 6 లక్షల అప్పు ఉందని, దాన్ని తీర్చాలని మెసేజ్‌లో పేర్కొన్నాడు. వెంటనే దీపక్‌కు అతడి సోదరుడు దినేష్‌ ఫోన్‌ చేయగా కలవలేదు. దీపక్‌ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దిశ సినిమాను నిలుపుదల చేయాలి 
సాక్షి, బన్సీలాల్‌పేట్‌: దిశ సంఘటన ఆధారంగా రాంగోపాల్‌వర్మ నిర్మిస్తున్న దిశ సినిమాను వెంటనే నిలుపుదల చేయాలని రెడ్డి జేఏసీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రెడ్డి జేఏసీ ప్రతినిధులు మంగళవారం కవాడిగూడ సీజీఓ టవర్స్‌లోని సెన్సార్‌ బోర్డు రీజినల్‌ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి జేఏసీ గ్రేటర్‌ అధ్యక్షుడు కె. ధర్మారెడ్డి, మహిళా అధ్యక్షురాలు విజితా రెడ్డి, సుమతీరెడ్డి, శ్వేతారెడ్డి మాట్లాడుతూ...దిశ సంఘటన దేశ ప్రజలను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆ బాధ నుంచి కోలుకోక ముందే దిశ పేరిట రాంగోపాల్‌వర్మ సినిమా తీసి విడుదల చేస్తామనడం సరికాదన్నారు. నవంబర్‌ 26న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయని, వెంటనే సెన్సార్‌ బోర్డు దిశ సినిమాను నిలిపివేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో రెడ్డి జేఏసీ ప్రతినిధులు విజయారెడ్డి, రాంచంద్రారెడ్డి, రంగారెడ్డి, దేవేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top