ఖతర్నాక్‌ హ్యాకర్‌.. భారీగా నగదు చోరీ

Hacker Srikrishna Arrested In Karnataka Thefting Money - Sakshi

పోకర్‌ వెబ్‌సైట్లకు గండి, బిట్‌కాయిన్ల దోపిడీ

బెంగళూరు : శాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో బెంగళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులకు పట్టుబడిన అంతర్జాతీయ హ్యాకర్‌ శ్రీకృష్ణ అలియాస్‌ శ్రీ జల్సా జీవితం కోసం బిట్‌కాయిన్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రస్తుతం అతడు పరప్పన సెంట్రల్‌ జైలులో రిమాండులో ఉన్నాడు. ఇతని ఖాతాలో రూ.9 కోట్లు విలువ చేసే 31 బిట్‌కాయిన్లను సీజ్‌ చేశారు. సీసీబీ విచారణలో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి. అంతర్జాతీయ స్థాయి వెబ్‌సైట్లతో పాటు వేర్వేరు దేశాల పోకర్‌గేమ్స్‌ వెబ్‌సైట్లలోని ఖాతాల్లోకి చొరబడి క్రిప్టో కరెన్సీలైన బిట్‌ కాయిన్, వైఎఫ్‌ఏ తదితరాలను దొంగించినట్లు కనిపెట్టారు. పోలీసులకు పట్టుబడిన శ్రీకృష్ణ అనుచరులు సునీశ్‌ శెట్టి, ప్రసిద్‌ శెట్టి, సంజయ్, హేమంత్‌ ముద్దప్ప, రాబిన్‌ ఖండేల్‌వాల్‌ ఇతరులతో కలిసి పోకర్‌ గేమింగ్‌ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేసి డేటాను చోరీచేసి ఆ డేటాను తమ గేమింగ్‌ వెబ్‌సైట్‌ కోసం వినియోగించేవారు. ఇప్పటి వరకు మూడు బిట్‌కాయిన్‌ ఎక్సే్ఛంజిలను, 10 పోకర్‌ వెబ్‌సైట్లు, 4 సాధారణ వెబ్‌సైట్లను హ్యాచ్‌ చేసినట్లు గుర్తించారు.

ప్రభుత్వ వెబ్‌సైట్‌కి కన్నం 
బెంగళూరు కేంద్రంగా హ్యాకర్‌ శ్రీకృష్ణ ప్రముఖ హోటళ్లు, రిసార్టుల్లో బస చేసేవాడు. దోచుకున్న బిట్‌కాయిన్లను తమ ఖాతాల్లోకి మళ్లించి ముఠాతో కలిసి నగదుగా మార్చుకునేవాడు. డార్క్‌నెట్‌ వెబ్‌సైట్ల గుండా విదేశాల నుంచి డ్రగ్స్‌ను ఈ బిట్‌కాయిన్ల ద్వారానే కొనేవాడు. 2019లో అక్రమంగా ధన సంపాదనకు కర్ణాటక ప్రభుత్వ ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి కోట్లాది ధనాన్ని తన అనుచరుల అకౌంట్లకు జమ చేశారని పోలీసుల విచారణలో వెలుగుచూసింది. కాగా, రూ.9 కోట్ల విలువైన 31 బిట్‌కాయిన్లను పోలీసులు సీజ్‌ చేశారు. అతని లావాదేవీలు, ఖాతాలపై విచారణ జరుపుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top