బంజారాహిల్స్‌: ప్రియుడి వేధింపులు.. బాలిక ఆత్మహత్య

Girl Ends Life By Hanging Over Harassment Banjara Hills Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: మైనార్టీ తీరకున్నా పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడి బెదిరింపులను భరించలేక మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) 5వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్‌ అనే యువకుడితో గత కొంతకాలంగా సన్నిహితంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుంటామంటూ దుర్గాభవానీ తండ్రి శ్యామ్‌సన్‌ వద్దకు వెళ్లి అడగగా మందలించాడు. మైనార్టీ తీరకముందే పెళ్లి చేసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించాడు. దీంతో ఐదు రోజుల క్రితం దుర్గాభవానీ ఇంట్లోంచి చెప్పకుండా వచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌.2లోని ఇందిరానగర్‌లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తన తండ్రి శ్యామ్‌సన్‌కు ఫోన్‌ చేసి చెప్పింది.

దీంతో శనివారం ఉదయం శ్యామ్‌సన్‌ నగరానికి వచ్చాడు. కూతురు దుర్గాభవానీతో మాట్లాడి నచ్చ జెప్పాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కల్యాణ్‌ తీవ్ర పదజాలంతో బెదిరింపులకు దిగడంతో పాటు పెళ్లికి అంగీకరించకపోతే శ్యామ్‌సన్‌ను, దుర్గాభవానీని చంపేస్తానంటూ బెధిరించి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై రోజంతా కుటుంబ సభ్యులు చర్చించారు. సాయంత్రం పనిమీద శ్యామ్‌సన్‌తో పాటు మిగిలిన వారు బయటికి వెళ్లి రాత్రికి తిరిగి వచ్చారు. ఆలోగా ఇంట్లో ఒంటరిగా ఉన్న దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురి చావుకు కల్యాణ్‌ బెదిరింపులే కారణమంటూ ఆదివారం మృతురాలి తండ్రి శ్యామ్‌సన్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలిసి..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top