స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల సంసారంలో నిప్పులు పోసుకున్నా | Sakshi
Sakshi News home page

స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల సంసారంలో నిప్పులు పోసుకున్నా

Published Thu, Oct 13 2022 8:39 PM

Forgive Me Swapna: RTC Conducter Suicide With Selfie Video At Madhira - Sakshi

సాక్షి, ఖమ్మం: ‘స్వప్నా.. నన్ను క్షమించు.. కొందరి వల్ల నేను ఇబ్బందులు పడ్డాను.. సాయి అమ్మను మంచిగా చూసుకో.. అమ్మ మాట విను..’అంటూ మధిర ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బింగి వెంకటేశ్వరరావు తన మృతికి కారణాలు వివరిస్తూ సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి. వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వరరావు మధిర ఆర్‌టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే, మధిరలోని కొందరు ఫైనాన్సర్లతో పాటు పలువురి వద్ద నుంచి మరికొందరికి ఆయన డబ్బు అప్పు ఇప్పించాడు.

అయితే, అప్పు తీసుకున్న వారు చెల్లించకపోవడంతో వెంకటేశ్వరరావుపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యాన కొంతకాలం ఆయన సొంతంగా వడ్డీ చెల్లించాడు. ఆతర్వాత చెల్లించే పరిస్థితి లేకపోవడంతో అత్తగారిల్లయిన ఏపీలోని పెనుగంచిప్రోలు నుంచి మధిరకు రాకపోకలు సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం కందుకూరుకు వచ్చిన వెంకటేశ్వరరావు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగి పడిపోయాడు.

ఈ విషయం పెనుగంచిప్రోలులో ఉన్న భార్యకు తెలియడంతో ఆమె రాత్రి చేరుకుని వచ్చి వెంకటేశ్వరరావు సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈమేరకు బుధవారం ఉదయం ఆమె తన భర్త కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్‌ తెలిపారు.

వైరల్‌గా మారిన వీడియో..
వెంకటేశ్వరరావు మృతికి అనారోగ్యమే కారణమని ఆయన భార్య ఫిర్యాదు చేయగా, బుధవారం సాయంత్రానికి ఆయన తీసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ‘పలువురి వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఇచ్చాను. ఇప్పుడు వారు కట్టకపోవడంతో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. కొంతకాలంగా సొంతంగా డబ్బు కట్టినా.. ఇక కట్టలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. నన్ను క్షమించు స్వప్నా(భార్య).. పచ్చని కాపురంలో నిప్పులు పోసుకున్నాను.. సాయి(కుమారుడు) అమ్మను మంచిగా చూసుకో’అని చెబుతూ పురుగుల మందు తాగి పడిపోయాడు. సాయంత్రానికి ఈ వీడియో వైరల్‌గా మారగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ వెంకటేశ్వరరావు రికార్డ్‌ చేసిన వీడియోలో పలువురి పేర్లను ప్రస్తావించినప్పటికీ వారు అప్పు ఇచ్చిన వారా, తీసుకున్న వారా అనేది తెలియరావడం లేదు.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement