పీటల మీద పెళ్లి నిలిపేసిన భార్య.. పాపం హనీమూన్‌ ట్రిప్‌..

First wife Stopped madhu sudhan wedding in Hassan District - Sakshi

పెళ్లి మండపంలో ఎటుచూసినా సందడి. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మూడుముళ్లకు సమయం సమీపిస్తోంది. వరుడు కూడా ఆతృతగా ఉన్నాడు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. వధువు తల్లిదండ్రులను కలిసి ఏదో చెప్పింది. అంతే పెళ్లి వేడుక బంద్‌ అయ్యింది. పోలీసులు వచ్చి వరున్ని తీసుకెళ్లారు. పూల కారుపై ఊరేగాల్సిన వరుడు జీపు ఎక్కాడు.  

సాక్షి, బెంగళూరు(యశవంతపుర): పెళ్లయిన సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన మోసగాన్ని హాసన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. బెంగళూరులో ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తున్న మధుసూదన్‌కు నాలుగేళ్ల క్రితం వసుధ అనే యువతితో వివాహమైంది. గొడవలు రావడంతో ఇద్దరు బెంగళూరులో విడివిడిగా ఉంటున్నారు, కానీ విడాకులు ఇంకా తీసుకోలేదు.  

హాసన్‌లో రెండో పెళ్లి తతంగం    
ఆ కేసు పరిష్కారం కాకుండానే అక్క సాయంతో హాసన్‌కు చెందిన అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడు. హాసన పట్టణంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి ఇరువైపులవారు చేరుకున్నారు. వసుధకు చూచాయగా విషయం తెలిసి గూగుల్‌లో హాసన్‌ పట్టణంలోని కళ్యాణ మండపాల వివరాలను సేకరించింది.

శుక్రవారం ఉదయం 10 గంటలకు మధుసూదన్‌ వధువుకు తాళికట్టే సమయానికి వసుధ అక్కడకు వచ్చి వధువు తల్లిదండ్రులను కలిసింది. అతని వల్ల నా జీవితం నాశనమైంది. మీ అమ్మాయి జీవితం కూడా పాడు కాకుండా చూసుకోండని గట్టిగా చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు మోసగాడు మధుసూదన్‌ను గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్‌ చేశారు.   

పాపం హనీమూన్‌ ట్రిప్‌  
పెళ్లి అయిన మరుసటి రోజున మాల్దీవులకు హనీమూన్‌కు వెళ్లాలని మధుసూదన్‌ ప్లాన్‌ వేశాడు. శనివారం విమానం ఎక్కడానికి పాస్‌పోర్ట్, వీసా, టికెట్లను రెడీ చేశాడు. పెళ్లి తరువాత మొదటి భార్య బంధువులు ఏమి చేయలేయరనే ధీమాతో ఉన్నాడు గానీ పథకం మొత్తం నీరు గారడంతో పాటు కటకటాల వెనక్కు చేరాడు. కాగా పీటల మీద పెళ్లి నిలిచిపోవడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అతని గురించి ముందే తెలిసి ఉంటే ఇంతవరకూ రానిచ్చేవారం కాదని వాపోయారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top