Karnataka Contractor Suicide: సూసైడ్‌ కేసులో మంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు.. సీఎం కీలక భేటీ

FIR Registered On Minister KS Eshwarappa Over Suicide Case - Sakshi

సాక్షి, బెంగళూరు: మంత్రి ఈశ్వరప్పకు కమీషన్లు ఇచ్చుకోలేనని సంతోష్‌పాటిల్‌ అనే బెళగావి జిల్లా కాంట్రాక్టర్‌ మంగళవారం ఉడుపిలోని ఒక లాడ్జిలో ఆత్మహత్య చేసుకోవడం కర్నాటకలో కలకలం రేపుతోంది.  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ – గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పే తన ఆత్మహత్యకు కారణమని కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ డెత్‌ నోట్‌ రాసిపెట్టి సూసైడ్‌ చేసుకున్నాడు. దీంతో మంత్రి పదవి నుంచి ఈశ్వరప్పను తప్పించాలని ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సంతోష్ పాటిల్ సోద‌రుడి ఫిర్యాదు మేర‌కు బుధవారం పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మంత్రి ఈశ్వర‌ప్పతో పాటు ఆయ‌న మ‌ద్దతుదారులు బ‌స‌వ‌రాజ్, ర‌మేశ్ పేర్ల‌ను కూడా చేర్చారు. అయితే ఈ కేసును పార‌ద‌ర్శకంగా ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసుల‌ను క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఆదేశించారు.

కాషాయ జెండా వివాదం.. 
బీజేపీలో ఎంతో సీనియర్‌ అయిన కేఎస్‌ ఈశ్వరప్పకు మాజీ సీఎం యడియూరప్పతో అసలు పొసగదు. అనేక మంది పార్టీ నేతలతోనూ అంతంతమాత్రమే సంబంధాలున్నాయి. ఎర్రకోటపై కాషాయ జెండా ఎగురుగుతుందని ఈశ్వరప్ప ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల అసెంబ్లీ సమావేశాలను కాంగ్రెస్‌పార్టీ వారంరోజుల పాటు అడ్డుకుంది.   

యడియూరప్ప, బొమ్మై మంతనాలు  
బెళగావి పర్యటనలో ఉన్న బీఎస్‌ యడియూరప్పతో మంగళవారం రాత్రి సీఎం బసవరాజ్‌ బొమ్మై భేటీ అయ్యారు. ఈశ్వరప్ప విషయమై చర్చించినట్లు తెలిసింది. నేడో – రేపో ఈశ్వరప్ప నుంచి రాజీనామా కోరవచ్చని సమాచారం.  

ఇదో చేతకాని సర్కార్‌: సుర్జేవాలా  
ఇది చేతకాని ప్రభుత్వమని రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి రణదీప్‌సింగ్‌ సుర్జేవాలా అన్నారు. మంగళవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ ఓ కాంట్రాక్టరును మంత్రి 40 శాతం కమీషన్‌ అడిగారని ఆత్మహత్య చేసుకోవడం దారుణం, ఆ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు. బుధవారం కాంగ్రెస్‌ నేతలు గవర్నర్‌ను కలవనున్నారు. 

ఇది చదవండి: మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి అసదుద్దీన్‌ సవాల్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top