Fake Police: చిన్న పని వుంది... ఒక్కసారి బైక్‌ ఇస్తే వెళ్లి వచ్చేస్తా..

Fake Police Arrest In Visakhapatnam - Sakshi

అల్లిపురం (విశాఖ దక్షిణ): పోలీస్‌ అని చెప్పుకుంటూ పలు నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని టూ టౌన్‌ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ కె.వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం... మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.ఈశ్వరరావు శనివారం ఉదయం పని నిమిత్తం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు తన ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా, శంకవరం మండలం, రేలంగ గ్రామానికి చెందిన వెలుగుల వెంకట రమణ (42) పోలీస్‌ యూనిఫాంలో అతని దగ్గరికి వచ్చాడు. తాను పోలీస్‌ కానిస్టేబుల్‌నని చెప్పి నకిలీ ఐడీ కార్డు చూపించాడు.
చదవండి: లవ్‌ ఫెయిల్యూర్‌.. యువతి ఆత్మహత్య.. మృతిపై భిన్న కథనాలు.. 

తన పేరు సీహెచ్‌ రాహూల్‌ అని, తాను ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఔట్‌ పోస్టులో పనిచేస్తున్నానని నమ్మించాడు. చిన్న పని వుంది... ఒక్కసారి బైక్‌ ఇస్తే వెళ్లి వచ్చేస్తానని చెప్పడంతో ఈశ్వరరావు బైక్‌ తాళాలు ఇచ్చాడు. అయితే గంటలు గడుస్తున్నప్పటికీ బైక్‌ తీసుకెళ్లిన కానిస్టేబుల్‌ రాకపోవడంతో బాధితుడు ఔట్‌పోస్టులో విచారణ చేశాడు. అయితే రాహుల్‌ అనే పేరు గల వారు ఎవరూ ఇక్కడ పనిచేయడం లేదని చెప్పడంతో తాను మోసపోయానని తలచి టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈశ్వరరావు ఫిర్యాదు చేశాడు.

వెంటనే ఈస్ట్‌ ఇన్‌చార్జి ఏసీపీ వై.గోవిందరావు ఆదేశాల మేరకు సీఐ వెంకటరావు సూచనలతో ఎస్‌ఐ సల్మాన్‌ బెయిగ్‌ విచారణ చేపట్టారు. నిందితుడిని సీసీ కెమెరా పుటేజీ ద్వారా పాత నేరస్తుడు వెలుగుల వెంకటరమణగా గుర్తించి, ఫోన్‌ నంబర్‌ ట్రాక్‌ చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి బైక్, పోలీస్‌ నేమ్‌ప్లేట్, పోలీస్‌ యూనిఫాం, ఐడీ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

జైలు నుంచి విడుదలై...  
నిందితుడు వెలుగుల వెంకటరమణ కాకినాడలో పోలీస్‌ యూనిఫాం కొని పలు నేరాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. జీఆర్‌పీ కేసులో 50 రోజులు జైలు శిక్ష ఏలూరు జైలులో అనుభవించి గత నెల 24న  విడుదలయ్యాడు. నిందితుడిపై కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, కొయ్యూరు, డుంబ్రిగుడ, ఎస్‌.కోట, అరుకు, కంచరపాలెం పోలీస్‌ స్టేషన్లలో పలు కేసులున్నాయి.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top