ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం 

Fake Employment Fraud Gang Arrested In Bellampalli - Sakshi

సాక్షి, బెల్లపల్లి: నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని, ఉద్యోగాల ఆశ చూపి, ఓ ముఠా రూ.లక్షల్లో వసూలు చేసింది. అనంతరం బాధితులను మోసగించిన ఘటనలో ఓ మహిళతోపాటు మరో ముగ్గురు వ్యక్తులను కరీంనగర్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ ఉద్యోగం లేక ఖాళీగా ఉండేది. ఈ క్రమంలో కుటుంబసభ్యులతో విడిపోయి, కరీంనగర్‌లోని ఆదర్శ నగర్‌లో ఒంటరిగా జీవిస్తోంది. జల్సాలకు అలవాటు పడి, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో అమాయక యువకులను లక్ష్యంగా చేసుకొని, ప్రేమ, ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెబుతూ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసింది. ఆమె తన ముఠా సభ్యులైన కంబాల రాజేశ్‌(41), కుసుమ భాస్కర్‌(48), భీమాశంకర్‌(28)లతో కలిసి కరీంనగర్‌లోని సిక్‌వాడీకి చెందిన ఓ యువకుడిని వరంగల్‌లోని ప్రభుత్వ ఆస్పుత్రిలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించింది. క్యాంటీన్‌ నిర్వహణ కాంట్రాక్టు పేరుతో రూ.13.5 లక్షలు, కరీంనగర్‌లోని తిరుమల నగర్‌లో నివాసం ఉంటున్న మరో వ్యక్తి నుంచి ప్రభుత్వ ఊద్యోగం పేరుతో రూ.7 లక్షలు, గోదావరిఖనికి చెందిన ఓ యువకుడి వద్ద రూ.3లక్షలు వసూలు చేశారు. నిందితురాలు వరంగల్‌కు చెందిన యువకుడితో తనను నికితారెడ్డిగా పరిచయం చేసుకొని, అతనితో చేసిన ఫోన్‌ చాటింగ్‌ చేసింది.

దాన్ని అడ్డుగా పెట్టుకొని బాధితుడిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ రూ.8లక్షల వరకు తీసుకుంది. సదరు మహిళ  కరీంనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ అని, అధికారుల వద్ద పలుకుబడి ఉందని నిరుద్యోగులతో నమ్మబలికింది. ఉద్యోగాలు ఇప్పిస్తానని, రిజిస్ట్రేషన్‌ నిమిత్తం, అధికారులకు ఇవ్వడానికి డబ్బులు ఖర్చవుతాయని నమ్మించింది. తన మూఠా సభ్యులను అధికారులుగా చూపించి, వసూళ్లకు తెరలేపింది. బాధితులు తాము మోసపోయామని గ్రహించి, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రాజేష్, భాస్కర్, భీమాశంకర్‌లను పెద్ద మనుషులుగా చూపించింది. తన మొబైల్‌లో చాటింగ్‌ను చూపిస్తూ వారిపైనే కేసులు పెడుతూ బెదిరింపులకు గురిచేసింది.

ఈ ఘటనలతో నిఘా పెట్టిన పోలీసులు నిందితులందరినీ పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.20 వేలు, నకిలీ నియామక పత్రాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కరీంనగర్, గోదావరిఖని, వరంగల్, హైద్రాబాద్‌ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరీంనగర్‌ సీపీ వీబీ.కమలాసన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చేవారి మాయమాటలు నమ్మి, డబ్బు, సమయం కోల్పోవద్దన్నారు. ఈ ముఠా వల్ల మోసపోయిన వారు ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అధికారులను సంప్రదించాలని సూచించారు. సీఐ విజయ్‌కుమార్, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్, శశిధర్‌ రెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top