నామాకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలోనే భారీ షాక్‌

Enforcement Directorate Notice To Nama Nageswar Rao Company Directors - Sakshi

త్వరలో నామా నాగేశ్వరరావు కంపెనీ డైరెక్టర్లకు ఈడీ పిలుపు

ఎస్పీవీ నుంచి రూ.264 కోట్లు మళ్లించిన ఆరోపణలపై విచారణ

నిధులు పక్కదారి పట్టాయని ఎస్‌ఎఫ్‌ఐఓ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ‘రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌’డైరెక్టర్లను త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నించనుంది. ఈ కంపెనీ నుంచి పలు కారణాలు చెప్పి, ఇతర కంపెనీలకు మళ్లించిన రూ.264 కోట్ల విషయంపై ఆరా తీసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను అందుకే ఖర్చు చేయాల్సింది పోయి వేరే మార్గాల ద్వారా ఎందుకు పంపించాల్సి వచ్చిందన్న విషయంపై ఈడీ ఆరా తీస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం త్వరలోనే ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు ముగ్గురు డైరెక్టర్లను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. రూ.1,151 కోట్ల విలువైన రాంచీ-రార్‌గావ్‌- జంషెడ్‌పూర్‌ వరకు 163 కి.మీ. మేర ఉన్న ఎన్‌హెచ్‌–33 4 లేన్ల రహదారి పనుల ప్రాజెక్టును మధుకాన్‌ కంపెనీ 2011లో దక్కించుకుంది. ఇందుకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్పీవీ) కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టర్లుగా కె.శ్రీనివాస్‌రావు, ఎన్‌.సీతయ్య, ఎన్‌.పృథ్వీతేజ వ్యవహరిస్తున్నారు.

ఎలా మళ్లించారంటే? 
రహదారి ప్రాజెక్టు పనులను చూపించి రూ.1,029.39 కోట్లు బ్యాంకుల కన్సార్షియం నుంచి రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే రుణం పొందింది. ఈ కన్సార్షియానికి కెనరా బ్యాంకు లీడ్‌ బ్యాంకుగా వ్యవహరించింది. ఆ తర్వాత మధుకాన్‌పై ఆరోపణలు రావడంతో వాస్తవాలు తేల్చాలని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ)ను జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. తీసుకున్న రుణంలో నుంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టాయని ఎస్‌ఎఫ్‌ఐఓ నివేదిక ఇచ్చింది. రౌండ్‌ ట్రిప్పింగ్‌ ఎక్సర్‌సైజ్‌ కింద రూ.50 కోట్లు, డైవర్షన్‌ మొబిలైజేషన్, మెటీరియల్‌ అడ్వాన్స్‌ కింద రూ.22 కోట్లు, మెయింటెనెన్స్‌ పేరిట రూ.98 కోట్లు, మెటీరియల్‌ యుటిలైజేషన్‌– మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింద మధుకాన్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌కు రూ.94.01 కోట్లు.. ఇలా మొత్తం రూ.264.01 కోట్లు మళ్లించారని ఎస్‌ఎఫ్‌ఐఓ నివేదించింది. 2019 మార్చిలో రంగంలోకి దిగిన సీబీఐ ఈ వ్యవహారంలో వారికి కోటా ఆడిట్‌ కంపెనీ సాయం చేసిందని గుర్తించింది. మధుకాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, మధుకాన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్, మధుకాన్‌ టోల్‌హైవే లిమిటెడ్, కోటా ఆడిట్‌ కంపెనీ, గుర్తు తెలియని బ్యాంకు ఉద్యోగులపై ఫోర్జరీ, నకిలీ పత్రాల సృష్టి, తప్పుడు పద్దుల నిర్వహణల ఆరోపణల కింద కేసు నమోదు చేసింది. రుణాలు మంజూరైనా పనుల్లో పెద్దగా పురోగతి లేదని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top