అప్పిచ్చి.. ఆందోళన చేసి.. ప్రాణాలు పోగొట్టుకుని..

Emotional Effects Of Debt Person Ends His Life In Karimnagar - Sakshi

అప్పు తీసుకుని మొహం చాటేసిన స్నేహితుడు 

అనారోగ్యంతోనే అతని ఇంటి ముందు 12 రోజులుగా బాధితుడి పోరాటం  

పరిస్థితి విషమించడంతో ప్రాణాలు పోయిన వైనం

శంకరపట్నం: ప్రాణస్నేహితుడని డబ్బు అప్పిస్తే.. అతను తిరిగి ఇవ్వలేదు సరికదా.. తిరిగి అడిగితే.. ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. డబ్బు కోసం ఆందోళన చేపట్టిన బాధితుడు చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామానికి చెందిన ఈరెల్లి సంపత్, శనిగరపు సతీశ్‌ ప్రాణస్నేహితులు. సంపత్‌ 2020లో సతీశ్‌కు రూ.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. 2021లో తిరిగి డబ్బులు అడిగితే రూ.3 లక్షలు చెల్లించి మిగతా రూ.7 లక్షలు ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నాడు.

ఈ క్రమంలో సంపత్‌ అనారోగ్యానికి గురయ్యారు. వైద్యానికి డబ్బులు అవసరం కావడంతో కిడ్నీవ్యాధితో బాధపడుతూనే బాకీ డబ్బుల కోసం సతీశ్‌ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సతీశ్‌ బాకీ డబ్బులు ఇవ్వకుండా, ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయినప్పటికీ సంపత్‌ అక్కడే 12 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాగా, పరిస్థితి విషమించి బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం మెట్‌పల్లి గ్రామానికి వచ్చారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సతీశ్‌ కోసం సాయంత్రం వరకు వేచిచూశారు.

అప్పటికీ రాకపోవడంతో సతీశ్‌ ఇంటి ఎదుటే మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే హుజూరాబాద్‌ రూరల్‌ సీఐ జనార్దన్‌ మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెప్పడంతో వారు ఆ ప్రయత్నం మానుకున్నారు. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుడి భార్య లలిత.. శనిగరపు సతీశ్, మరికొందరిపై ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ మల్లారెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top