భర్త రెండో పెళ్లికి ప్లాన్‌.. ప్రాణాలు తీసుకున్న భార్య

Domestic Violence Woman Self Elimination At Bhogapuram Vizianagaram - Sakshi

అత్త, మామలతో కలిసి భర్త కూడా విడాకులకు ఒత్తిడి 

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య  

అనాథలుగా మారిన ఇద్దరు పిల్లలు 

వివాహమై నాలుగేళ్లకే వేసిన మూడుముళ్లు భారంగా మారాయి. ఆ దాంపత్య జీవితానికి ప్రతిరూపాలుగా మూడేళ్లు బాబుతోపాటు తొమ్మిది నెలల బాబు ఉన్నారు. బోసినవ్వుల ఆ చిన్నారుల బుడిబుడి అడుగులు చూసి మురిసిపోవాల్సిన ఆ కుటుంబంలో ‘విడాకుల’ అలజడి రేగింది. సర్దిచెప్పాల్సిన అత్త,మామలు ఆది నుంచీ అదే పాట పాడడం, వారి మాటలకు భర్తకూడా చివరిలో తందానా అనడంతో మనస్తాపానికి గురై రెండు పదుల వయసులోనే తనువు చాలించేసింది.     

భోగాపురం: కట్టుకున్న భర్త, అత్తమామల వేధింపులు తాళలేక వెంపాడ రమాదేవి (21) ఫ్యానుకు ఉరి వేసుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని రావివలస గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...మండలంలోని రావివలస గ్రామానికి చెందిన వెంపాడ రాములబంగారికి (అలియాస్‌ శ్యామ్‌) దల్లిపేట గ్రామానికి చెందిన రమాదేవికి నాలుగేళ్ల కిందట వివాహమైంది. వీరి కాపురం కొన్నేళ్లే అన్యోన్యంగా సాగింది. వీరికి కౌశిక (3), వాయిత్‌ (9 నెలలు) ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లి అయిన రెండేళ్ల తరువాత వీరి కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వస్తుండేవి.

భర్తతోపాటు అత్త,మామలు తరచూ రమాదేవిని వేధించడం మొదలుపెట్టారు. 15 రోజుల కిందట తన కుమారుడికి రెండో వివాహం చేసేందుకు అత్త అప్పలనరసమ్మ, మామ రమణ కలిసి తన కుమారుడు రాములబంగారికి విడాకులు ఇవ్వాలంటూ కాగితంపై సంతకం పెట్టమని రమాదేవిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న రమాదేవి తల్లిదండ్రులు వారి బంధువులు కలిసి గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారిద్దరికీ సర్దిచెప్పి పంపిచారు. ఈక్రమంలో మళ్లీ సోమవారం అత్తమామలతో పాటు భర్త కూడా విడాకులు ఇవ్వాలని రమాదేవిని వేధించడం మొదలుపెట్టాడు.

దీంతో జీవితంపై విరక్తి చెందిన రమాదేవి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అందరితో కలుపుగోలుగా ఉండే ఈమె చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ యు.మహేశ్, తహసీల్దారు డి.రాజేశ్వరరావు, గ్రామ సర్పంచి ఉప్పాడ, శివారెడ్డి సంఘటన స్థలానికి చెరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సుందరపేట సీహెచ్‌సీకి తరలించి మృతురాలు తండ్రి దల్లి రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top