జీఎస్టీ పేరుతో విడతల వారీగా రూ.5.90 లక్షలు కాజేశారు

Cybercriminals cheated Tribal couples at Nellore - Sakshi

గిరిజన దంపతులకు నాప్టాల్‌ పేరుతో లేఖ

రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని ఎర 

నెల్లూరు జిల్లాలో ఘటన  

గూడూరు: పెద్ద మొత్తంలో నగదు గెలుచుకున్నారని ఆశపెట్టి గిరిజన దంపతులను సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారు. రెక్కలుముక్కలు చేసుకొని ఇంటి కోసమని కూడబెట్టుకున్న సొమ్మును దోచేశారు. రూ.12.80 లక్షలు గెల్చుకున్నారని మభ్యపెట్టి.. రూ.5.90 లక్షలు కాజేశారు. ఈ ఘటన శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. గూడూరు మండలం పురిటిపాళెంకు చెందిన కమ్మంపాటి మహేష్, లక్ష్మీదేవి.. కొలనుకుదురులో రొయ్యల చెరువుల వద్ద కాపలా ఉంటున్నారు. వారి పెద్ద కుమారుడు చెంచయ్య వరి కోత మిషన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబమంతా కలిసి ఇల్లు నిర్మించుకునేందుకని రూ.2.50 లక్షలు పొదుపు చేసుకున్నారు.

ఈ క్రమంలో గతేడాది వినాయక చవితికి ముందు లక్ష్మీదేవికి ఓ ఉత్తరం వచ్చింది. అందులో రూ.12.80 లక్షలు గెల్చుకున్నట్లు ఉంది. ఆ కార్డులో ఉన్న నంబర్‌కు మహేష్, లక్ష్మీదేవి ఫోన్‌ చేయగా.. అవతలి వ్యక్తి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి కంపెనీ ద్వారా కూపన్‌లు తీస్తామని.. తాజాగా తీసిన లక్కీ డ్రాలో మీకు రూ.12.80 లక్షలు వచ్చాయని చెíప్పి ఫోన్‌ పెట్టేశాడు. మళ్లీ అదే నంబర్‌కు ఫోన్‌ చేయగా.. ఆ మొత్తం మీ అకౌంట్‌లో జమ చేయాలంటే ఆధార్, పాన్‌కార్డు నంబర్లతో పాటు అకౌంట్‌ వివరాలు వాట్సాప్‌ చేయాలని సూచించాడు.

అనంతరం ఆదాయ పన్ను కింద రూ.20 వేలు తమ అకౌంట్‌లో వేయాలని చెప్పాడు. దీనిపై మహేష్, లక్ష్మీ ప్రశ్నించగా.. ఆదాయ పన్ను చెల్లించకపోతే అధికారులు, పోలీసులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారని నమ్మబలికాడు. దాంతో వారిద్దరూ ఆ వ్యక్తి చెప్పిన అకౌంట్‌లో డబ్బులు వేశారు. ఈసారి జీఎస్టీ, ఇతర ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పాడు. మా వద్ద డబ్బులేదని ఆ గిరిజన దంపతులు మొత్తుకున్నా.. వినకుండా ఫోన్‌ పెట్టేశాడు. దీంతో వారు చేసేదిలేక తమ వద్ద ఉన్న రూ.2.50 లక్షలతో పాటు అప్పు చేసి మరో రూ.3.40 లక్షలు ఇచ్చారు.

అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో వారు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మోసగాళ్లు 7585049583, 9831371553 ఈ నంబర్ల నుంచి ఫోన్‌ చేశారని గిరిజన దంపతులు తెలపగా.. ఇవి కోల్‌కతాకు చెందిన హరిప్రసాద్‌ అనే వ్యక్తి పేరున ఉన్నట్లు గుర్తించారు. ఎస్పీ ఆదేశాలతో గూడూరు రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top