ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్‌ కార్డుల నుంచి నగదు లూటీ  | Cyber Crime: Cash Looted From Credit Cards If OTP Is Not Given | Sakshi
Sakshi News home page

ఓటీపీ ఇవ్వకపోయినా క్రెడిట్‌ కార్డుల నుంచి నగదు లూటీ 

Published Sat, Dec 4 2021 4:19 PM | Last Updated on Sat, Dec 4 2021 4:41 PM

Cyber Crime: Cash Looted From Credit Cards If OTP Is Not Given - Sakshi

విజయవాడకు చెందిన మల్లెల శేషగిరిరావు బెంగళూరులో ఉండే తన స్నేహితుడికి పుట్టిన రోజు బహుమతి ఇచ్చేందుకు ఓ వస్తువు కోసం ఆన్‌లైన్‌లో వెతికాడు. తన స్నేహితుడి కోరిక మేరకు ఓ వస్తువును కొనుగోలు చేసేందుకు ఓ విక్రయ కంపెనీని మెయిల్‌ ద్వారా సంప్రదించాడు. తన స్నేహితుడు ఉండే చిరునామాకు సదరు వస్తువును డెలివరీ ఇస్తామని కంపెనీ నుంచి హామీ వచ్చిన తర్వాత శేషగిరిరావు నగదు లావాదేవీలు ప్రారంభించాడు. అయితే రూ. 620 ఖరీదు చేసే వస్తువుకు కంపెనీ రూ. 49,999 బిల్‌ చేసి శేషగిరిరావును ఓటీపీ అడిగింది.

దీంతో అనుమానం వచ్చిన శేషగిరిరావు నగదు లావాదేవీలను వెంటనే ఆపేసి.. వస్తు కొనుగోలును ఉపసంహరించుకున్నాడు. ఈ వ్యవహారం జరిగింది ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీన. సీన్‌ కట్‌ చేస్తే.. అయితే అదే రోజు శేషగిరిరావు ఉపయోగించే క్రెడిట్‌ కార్డ్‌ నుంచి రూ. 49,999 డెబిట్‌ అయినప్పటికీ మెసేజ్‌ మాత్రం రాలేదు. కాగా వారం క్రితం క్రెడిట్‌ కార్డు సంస్థ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. ముంబై కేంద్రంగా నడిచే ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ ద్వారా హరియాణా నుంచి రాజస్థాన్‌కు ఓ పార్సిల్‌ డెలివరీ అయ్యిందని దానికి గానూ రూ.49,999 అయినట్లు ఆ మెసేజ్‌ ఉంది. తనకు సంబంధం లేని వస్తు డెలివరీకి తన ఖాతా నుంచి నగదు పోవడంతో కంగారు పడిన శేషగిరిరావు వెంటనే బ్యాంక్‌ సిబ్బందిని, క్రెడిట్‌ కార్డ్‌ విభాగం అధికారులను, కస్టమర్‌ కేర్‌ సిబ్బందిని సంప్రదించాడు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విజయవాడ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

ఇలాంటి బాధితులు ఎంతో మంది.. 
దేశ వ్యాప్తంగా సేవలందిస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకుకు విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ఓ బ్రాంచ్‌ ఉంది. దీనిలో ఖాతాలు కలిగి.. క్రెడిట్‌ కార్డ్‌ వినియోగిస్తున్న 35 మంది ఇదే తరహాలో సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో బాధితులు మిన్నకుండిపోతున్నారు. బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ నిర్వాహకులే సైబర్‌ నేరగాళ్లకు తమ కార్డ్‌ వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చి నగదు కాజేస్తున్నట్లు బాధితులు అనుమానిస్తున్నారు.  

పట్టించుకోని సైబర్‌ క్రైం అధికారులు.. 
విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతున్నా.. కనీసం ఫిర్యాదు సైతం తీసుకోకపోవడంతో బాధితులు ఎవరికీ చెప్పుకోలేక మిన్నకుండిపోతున్నారు. రూ. 2 లక్షల లోపు మోసం జరిగిన ఫిర్యాదులను తీసుకోమని సైబర్‌ సెల్‌ అధికారులు తెగేసి చెప్పడంతో లబోదిబోమంటున్నారు. బాధితులు తమ ప్రాంతంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా కనీసం ఫిర్యాదు తీసుకోవడం లేదనివాపోతున్నారు. 

బాధితులు వేలల్లో.. కేసులు పదుల్లో.. 
బాధితులు వేలల్లో ఉంటే గడిచిన ఏడాది కాలంలో విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నమోదు చేసిన కేసులు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఇక పరిష్కరించిన సమస్యలు ఏడాది కాలంలో రెండు అంకెలు దాటక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటే సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే సదస్సులు కూడా అంతంతమాత్రంగానే నిర్వహిస్తున్నారు. 

క్లిక్‌ చేస్తే ఖల్లాస్‌..
విజయవాడ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజూ ఎంతో మంది సైబర్‌ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్‌ కేటుగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రోగ్రామింగ్‌ యాప్స్‌ నుంచి ఖాతాదారులకు ‘బ్యాంక్‌ ఖాతా నిలిచిపోయింది’, ‘గూగుల్‌ పే, ‘ఫోన్‌ పే’ ఇకపై వాడలేరంటూ ఫోన్‌లకు మెసేజ్‌లు పంపి ఖాతాదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏదో అయిపోతుందనే కంగారులో సదరు మెసేజ్‌ వెబ్‌ లింక్‌ను క్లిక్‌ చేసిన వెంటనే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ ఖాతా వివరాలు పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతున్నాయి. అక్కడ నుంచి క్రెడిట్‌ కార్డ్, బ్యాంక్‌ ఖాతాలోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. అయితే మధ్యలో ఉన్న బ్యాంక్‌ అధికారులకు ఇబ్బందులు రాకుండా ఏదో ఆన్‌లైన్‌ డెలివరీ అని సృష్టించి నగదును దోచుకుంటున్నారు. ఖాతాదారులు బ్యాంకులపై న్యాయ పోరాటానికి దిగేందుకు వీలు లేకుండా సైబర్‌ నేరగాళ్లు బ్యాంక్‌లకు ఈ విధంగా సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్‌ నేరగాళ్లకు, బ్యాంక్‌ అధికారులకు సంబంధాలున్నాయనే అనుమానం బాధితుల్లో తలెత్తుతోంది.

సైబర్‌ నేరగాళ్లు తెలివి మీరారు.. 
పోలీసుల కంటే నేరగాళ్లే ఎక్కువ తెలివిగా, చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రూ. 2 లక్షల పైబడి మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నాం. వాటిలో కొన్ని పరిష్కరించాం. రూ. 2 లక్షల లోపు మోసపోయిన వారి నుంచి ఫిర్యాదు తీసుకోవద్దని ఉన్నతాధికారుల నుంచి మాకు ఆదేశాలున్నాయి. అయినప్పటికీ మా దగ్గరకు వచ్చిన వారి వివరాలు సేకరించి.. మరోసారి మోస పోకుండా పలు సూచనలు చేసి పంపుతున్నాం. తక్కువ మొత్తంతో మోసపోయిన వ్యక్తులు వారి ప్రాంతంలోని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలి.  
–  కె.శ్రీనివాస్, సీఐ, సైబర్‌ క్రైం, విజయవాడ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement