గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

Published Thu, Jun 2 2022 11:31 PM

Crime News: Devarapalli Police Seized 556 Kg Of Ganja - Sakshi

దేవరాపల్లి: అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇతర రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువ చేసే 556 కేజీల గంజాయిని దేవరాపల్లి పోలీసులు బుధవారం శ్రీరాంపురం వై.జంక్షన్‌ వద్ద పట్టుకున్నారు. వివరాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్‌ఐ పి.సింహాచలంతో కలిసి చోడవరం సీఐ సయ్యద్‌ ఇలియాస్‌ మహ్మద్‌ వెల్లడించారు.

జీనబాడు చెక్‌పోస్టు దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా సంచరిస్తున్నట్టు ఎస్‌ఐ పి.సింహాచలంకు పక్కా సామాచారం రావడంతో తన సిబ్బందితో వెళ్లి అక్కడ పాడేరు మండలం బొడ్డాపూట్‌కు చెందిన రేగం గోవింద, కొర్రా నాగేశ్వరరావు అనే ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్న విషయం బయటపడింది.

తక్షణమే పోలీసులు సమీపంలో మాటు వేసి గంజాయితో వస్తున్న బొలెరో వ్యాన్‌ను అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో వ్యాన్‌ డ్రైవర్, యజమానితో పాటు ద్విచక్ర వాహనంపై వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల నుంచి రూ. 40 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. గంజాయితో పాటు బొలెరో వ్యాన్‌ను, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసం గాలిస్తున్నామన్నారు. గంజాయి తరలింపులో కచ్చితమైన సమాచారాన్ని ముందస్తుగా సేకరించిన సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.   

501 కిలోల గంజాయి పట్టివేత
పెదబయలు : మండలంలోని సీతగుంట జంక్షన్‌లో బుధవారం తెల్లవారు జామున పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా 501 కిలోల గంజాయి, లారీని స్వాధీనం చేసుకోవడం జరిగిందని స్థానిక ఎస్‌ఐ పులి మనోజ్‌కుమార్‌ తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తున్నట్టు గమనించిన లారీ డ్రైవర్‌ లారీని నిలిపివేసి పరారయ్యాడని, లారీలో గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లారీని సీజ్‌ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. లారీ విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతానికి చెందినదిగా గుర్తించామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

మోతుగూడెంలో ఐదుగురు అరెస్టు  
మోతుగూడెం: మోతుగూడెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద బుధవారం పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం ఎస్‌ఐ వి.సత్తిబాబు తన సిబ్బందితో సాయంత్రం తనిఖీలు చేస్తుండగా మోటార్‌ బైక్‌ వస్తున్న ఇద్దరు యువకుల్ని ఆపారు. దీంతో కారులో ఉన్న నలుగురిలో ఒకరు కారు దిగి పారిపోయాడు.

దీంతో పోలీసులు కారులో ఉన్న ముగ్గురిని, బైక్‌ వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా 20 కేజీల గంజాయి లభించింది. మధ్యవర్తుల రిపోర్టులో గంజాయిని, ఒక బైక్, కారు, ఐదు సెల్‌ఫోన్‌లు, నగదును సీజ్‌ చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. డొంకరాయి సమీప అటవీ ప్రాంతం నుంచి గంజాయిని ఖమ్మం జిల్లా ఎల్లందుకు తీసువెళ్తుండగా పట్టుబడినట్టు తెలిపారు.

పట్టుబడిన వారిలో కొత్తగూడెం జిల్లా ఎల్లందు చెందిన ముక్కు శ్రీవ్యాస్, సిరిమల్ల రాజేష్, గర సాంధల లింగారెడ్డి, మల్కన్‌గిరి జిల్లా చెందిన తుమ్మా చరణ్, పలాస ఇంద్రలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఒడిశాకు చెందిన పలాస పాపారావు పరారీలో ఉన్నట్టు తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement