కరోనా పాజిటివ్‌ ఉన్నా.. లేనట్లుగా..

Covid 19 Fake Certificate Create Gang Arrested Police Hyderabad - Sakshi

సాక్షి,చాంద్రాయణగుట్ట(హైదరాబాద్‌): వేర్వేరు ఘటనల్లో నకిలీ ఆర్టీపీసీఆర్‌ నివేదికలు, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను సృష్టిస్తున్న ఆరుగురిని దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పురానీహవేళీలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ గుమ్మి చక్రవర్తి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన పి.లక్ష్మణ్‌(30) పదేళ్ల క్రితం డిప్లోమా పూర్తి చేసి పలు డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేశాడు. ఏడాది క్రితం ఆస్మాన్‌ఘడ్‌లో ‘హోం కేర్‌ డయాగ్నోస్టిక్‌ సర్వీసెస్‌ సెంటర్‌’ను ప్రారంభించాడు. ఇటీవల థర్డ్‌వేవ్‌ ప్రారంభం కావడంతో విమాన, ఇతర రాష్ట్ర ప్రయాణాలకు ఆర్టీపీసీఆర్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి చేయడాన్ని లక్ష్మణ్‌ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

నాంపల్లికి చెందిన ప్రభాత్‌ కుమార్‌ సంఘీ(45) సహకారంతో అవసరమైన వారికి స్వాబ్‌ను పూర్తిస్థాయిలో తీయకుండా (లిక్విడ్‌ వేయకపోవడం) తను ఒప్పందం చేసుకున్న ల్యాబ్‌లకు పంపి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చేలా చేసి వినియోగదారులకు ఇచ్చేవాడు. ఇలా ఒక్కో రిపోర్ట్‌కు రూ.2–3 వేల వరకు వసూలు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలోని ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, మలక్‌పేట పోలీసులు ఇద్దరినీ అరెస్ట్‌ చేసి వీరి వద్ద నుంచి 65 నకిలీ ఆర్టీపీసీఆర్‌ నివేదికలు, 20 శాంపిల్‌ కిట్లు, ఒక సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.  

నకిలీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను సృష్టిస్తూ
వ్యాక్సిన్‌ తీసుకోకున్నా యూపీహెచ్‌ఎసీ అవుట్‌ సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ సహకారంతో నకిలీ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆసిఫ్‌నగర్‌కు చెందిన ల్యాబ్‌ టెక్నిషియన్‌ మహ్మద్‌ తారీఖ్‌ హబీబ్‌(28) ఏడాది క్రితం స్థానికంగానే “ఇమేజ్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌’ను ఏర్పాటు చేసి నెగెటివ్‌ రిపోర్ట్‌లు ఇచ్చాడు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అఫ్జల్‌సాగర్‌ యూపీహెచ్‌సీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ‘కుమారీ’ అనే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో కలిసి పథకం పన్నాడు. మెహదీపట్నంకు చెందిన గులాం ముస్తఫా షకీల్‌(48), అబ్దుల్‌ బషీర్‌(37), ఇర్ఫాన్‌ ఉర్‌ రబ్‌ అన్సారీ (32)ల సహకారంతో వాటిని అందజేస్తున్నాడు. హుమాయన్‌నగర్‌ పోలీసులతో కలిసి దాడులు చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు.  

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top