కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా  | Sakshi
Sakshi News home page

కామాంధులకు 20 ఏళ్ల జైలు, జరిమానా 

Published Sat, Aug 12 2023 3:19 AM

Courts vacillate verdict in molestation case - Sakshi

కామంతో కళ్లు మూసుకు పోయి అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన వేర్వేరు ప్రాంతాలకు  చెందిన ముగ్గురు కామాం ధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పులిచ్చాయి.

కర్నూలు(లీగల్‌)/పార్వతీపురంటౌన్‌/అనంతపురం: కామంతో కళ్లు మూసుకుపోయి వేర్వేరు ప్రాంతాలకు చెందిన అభం శుభం తెలియని చిన్నారులపై లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు కామాంధులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరి­మానా విధిస్తూ న్యాయస్థానాలు శుక్రవారం సంచలన తీర్పు­నిచ్చాయి. వివరా­ల్లో­కి వెళితే.. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం జిల్లెల గ్రామా­నికి చెందిన పెరుమాళ్ల వెంకటేశ్వర్లు కుమార్తె (17) నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతూ హాస్టల్‌లో ఉండేది. 2019 నవంబర్‌ 12వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వచ్చిన కుమా­­ర్తెను భయపెట్టి మధ్యా­హ్నం సమయంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

పది­రోజుల అనంతరం తన తండ్రి చేసిన అఘాయిత్యం గు­రించి తల్లికి చెప్పింది. దీంతో తల్లి, కుమార్తె నందివర్గం పోలీ­సు­లకు ఫిర్యాదు చేశారు. తండ్రి వెంకటేశ్వర్లుపై పోక్సో చట్టం, ఐపీసీ 376 కింద కేసు నమోదు చేశారు. విచా­రణ­లో నేరం రుజువు కావడంతో  కర్నూలు జిల్లా పోక్సో న్యాయ­స్థా­నం న్యాయమూర్తి జి.భూపాల్‌రెడ్డి ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కొత్తవ­లసలోని ఓ పాఠశాలలో నాలుగోతరగతి చదువుతున్న చిన్నారిని విడిచిపెట్టి తల్లి ఎటో వెళ్లిపోయింది.

చిన్నారి ఐరన్‌ షాపులో పనిచేస్తున్న తండ్రి వద్దనే ఉంటూ చదువుకుంటోంది. 2022 సంవత్సరం జూలై నెలలో చిన్నారి ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు కసాయి తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారం రోజుల తరువాత చిన్నారి పుట్టినరోజు సందర్భంగా నిందితుడు కేక్‌ తెచ్చాడు. దీంతో చిన్నారి తన స్నేహి­తు­రా­లి­ని ఇంటికి ఆహ్వా­నించింది. బాధితురాలితో పాటు ఆమె స్నేహి­తురాలు మధ్యా­హ్నం ఒంటి గంట సమయంలో నిద్ర­పో­తుండగా ఇద్దరిపైనా కసాయి తండ్రి లైంగికదాడికి యత్నిం­చాడు. చిన్నారులు ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టాడు. విషయాన్ని బాధితు­రాలి స్నేహితురాలు తన తల్లికి చెప్పింది. వెంటనే ఆమె ఇద్దరు బాలికలను తీసుకెళ్లి రెండు ఘటనలపైనా పోలీస్‌­స్టేషన్‌­లో ఫిర్యాదు చేసింది.

అప్పటి పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్‌ కేసు నమోదు చేశారు. రెండు కేసుల్లోనూ నేరం రుజువు కావడంతో ఎస్సీ, ఎస్టీ పోక్సోకోర్టు ఇన్‌చార్జి జడ్జి షేక్‌సికిందర్‌ బాషా ముద్దా­యికి ఒక్కో కేసులో 20 సంవత్స­రాల కఠిన కారాగార శిక్ష, రూ.10,000  జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. బాధిత చిన్నా­­రు­లు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల నష్ట పరిహారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ వివరాలను  పార్వ­తీపురం మన్యం జిల్లాఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ వెల్లడించారు.

అదే విధంగా శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామంలో తల్లిదండ్రులతో కలసి 13 ఏళ్ల బాలిక ఉండేది. 2019 ఆగస్టు 7వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పూజారి ఈశ్వరయ్య  అనే వ్యక్తి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితు­రాలి తల్లిదండ్రులు గోరంట్ల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్దాయిపై అభి­యో­గాలు రుజువు కావడంతో 20 ఏళ్ల  కఠిన కారాగార శిక్ష , రూ.5 వేల జరిమానా విధిస్తూ ఉమ్మడి అనంతపురం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాజ్యలక్ష్మి తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని ప్రభు­త్వానికి సిఫారసు చేశారు.

Advertisement
 
Advertisement