భూ తగాదా తీరితేనే నాన్న శవానికి అంత్యక్రియలు, చనిపోయి మూడురోజులైనా

A clash between two brotherly families for land - Sakshi

భూమి కోసం ఘర్షణలో అన్న దాడిలో తమ్ముడి మృతి

ఆ భూమి దక్కే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని తమ్ముడి కుటుంబసభ్యులపట్టు

ఆస్పత్రిలోనే మృతదేహాన్ని ఉంచి నిరసన

హాలియా: భూమి కోసం ఇద్దరి అన్నదమ్ముల కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు మృతి చెందాడు. అయితే ఆస్తి దక్కే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేది లేదని మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ దారుణ ఘటన అనుముల మండలంలోని యాచారం గ్రామంలో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన బైరు చెన్నయ్య, బైరు సైదులు సొంత అన్నదమ్ములు. చెన్నయ్యకు ముగ్గురు కుమారులు సంతానం కాగా సైదులుకు ఇద్దరు కుమార్తెలు. యాచారంలో  తండ్రి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిలో ఇరువురు అన్నదమ్ములు చెరో రెండు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు.

కాగా తండ్రి మరణాంతరం ఇంటికి పెద్ద కుమారుడైన బైరు చెన్నయ్య పేరున నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి పట్టా అయ్యింది. ఈ భూమి పట్టా విషయంలో కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య గొ డవలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది.

చనిపోయి మూడురోజులైనా..
కాగా ఈ నెల 8న ఇరు కుటుంబాల వారు మరోసారి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు కలిసి బైరు సైదులును కొట్టడంతో ఊపిరాడక కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం  నల్లగొండకు తరలిస్తుండగా  మార్గ మధ్యలోనే సైదులు మృతిచెందాడు.

ఈ నేపథ్యంలో మృతుడి కుమార్తె పూజిత హాలియా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బైరు చెన్నయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. కాగా ఆస్తి విషయంలో తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని గత మూడు రోజులుగా మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రిలో ఉంచి సైదులు కుటుంబ సభ్యులు నిరసన తెలుపుతున్నారు.

భూమిని తమకు రిజిస్ట్రేషన్‌ చేసే వరకు మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించేదిలేదని కుటుంబ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి పరిష్కార మార్గం చూపుతున్నట్లు తెలిసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top