'అద్దె'రిపోయే స్కెచ్‌...

Cheater Arrested In East Godavari - Sakshi

అద్దె పేరిట కార్ల యజమానులకు ఎర  

ఆపై సొమ్ము చెల్లించకుండా తప్పించుకుని తిరిగే వ్యక్తి అరెస్టు  

సుమారు రూ.20 లక్షల మేర పలువురికి బకాయి  

ఓ బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన మోసం

కేసు నమోదు రూ.1.50 కోట్ల విలువైన 14 కార్ల స్వాదీనం 

డబ్బు సులువుగా సంపాదించడంలో అతడు ఘనాపాటి. రూపాయి పెట్టుబడి లేకుండా ఎదురువారి బలహీనతను పెట్టుబడిగా చేసుకుని ఎంజాయ్‌ చేసే జల్సా రాయుడు. ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ పేరిట చక్రం తిప్పిన అతడు ఏడాదిగా లక్షలు విలువైన కార్ల యజమానులను బురిడీ కొట్టిస్తూ వస్తున్నాడు. విలువైన కార్లను బట్టి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు నెలకు అద్దె ఎర చూపి ఆ తరువాత అద్దె ఇవ్వకుండా మనిషి కనిపించకుండా ముఖం చాటేసే ఆ ప్రబుద్ధుడు ఎట్టకేలకు ఓ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల పాలయ్యాడు. 

సాక్షి, కాకినాడ రూరల్‌: కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట కూరగాయల మార్కెట్‌ ఎదురుగా నివాసం ఉండే మండవల్లి వెంకట సత్య కృష్ణ మోహన్‌ను సర్పవరం పోలీసులు ఆదివారం ఛీటింగ్‌ కేసులో అరెస్టు చేశారు. ఆదివారం స్థానిక పోలీసు స్టేషన్‌ ఆవరణలో సీఐ గోవిందరాజు మీడియా సమావేశంలో నిందితుడు చేసిన మోసాన్ని వివరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కార్ల యజమానులకు అద్దె ఎర చూపి వారి కార్లను తీసుకుని ఇతరులకు అద్దెకు లేదా సొమ్ములు తీసుకుని తనఖా పెడుతూ నాగ వెంకట సత్య కృష్ణమోహన్‌ ఏడాదిగా వ్యాపారం సాగిస్తున్నాడు. ఆ విధంగా సుమారు 30 కార్ల వరకు అద్దెకు తీసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.


నిందితుని వివరాలు వెల్లడిస్తున్న సర్పవరం సీఐ  గోవిందరాజు 

మొదట్లో అద్దె చెల్లించి తరువాత కనిపించకుండా ముఖం చాటేయడంతో కృష్ణమోహన్‌పై అనుమానం వచ్చిన సామర్లకోట మండలం పనసపాడుకు చెందిన ఓ కారు యజమాని తోట పద్మజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో చాలా కార్ల యజమానులు తమ కార్లకు అద్దె చెల్లించడం లేదని, కార్లు చేతులు మారాయని పోలీసులకు తెలిపారు. కృష్ణమోహన్‌ అద్దెకు తీసుకున్న కార్లలో సుమారు రూ.1.50 కోట్ల విలువైన 14 కార్లను ఎస్సై కృష్ణబాబు, సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. (కడపలో అంతరాష్ట్ర దోపిడీ గ్యాంగ్‌ కలకలం)

బాధితులకు సుమారు రూ.20 లక్షల వరకు అద్దె బకాయి పడినట్టు గుర్తించారు. కార్ల వివరాలు కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం కోర్టు ఆదేశాల మేరకు బాధితులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మీ, ఇన్‌చార్జి డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆదేశాలతో బాధితులు నష్టపోకుండా కేసు త్వరగా ఛేదించామని సీఐ తెలిపారు. ఇందుకు ఏఎస్సై నాగేశ్వరరావు, హెచ్‌సీ రామకృష్ణ, పీసీలు సతీష్‌, దుర్గాప్రసాద్, రూప్‌కుమార్‌లు సహకరించారన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top