భారీ కుంభకోణం: రూ.4,837 కోట్లు ఎగవేత

CBI Files Case Against RS 4837 Crore Loan Fraud IVRCL Hyderabad - Sakshi

వెలుగుచూసిన మరో భారీ బ్యాంకు రుణాల మోసం

ఐవీఆర్‌సీఎల్‌ కంపెనీ కార్యాలయంతోపాటు పలుచోట్ల సీబీఐ దాడులు

మహేష్‌ బ్యాంకు కేసులో తీర్పు రిజర్వు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో భారీ బ్యాంకు రుణాల ఎగవేత కుంభకోణం వెలుగుచూసింది. దాదాపు రూ.4,837 కోట్లు రుణంగా పొంది, తిరిగి చెల్లించడంలో విఫలమైందనే ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఎఫ్‌.ఐ.ఆర్‌లో ఐవీఆర్‌సీఎల్‌ లిమిటెడ్, హైదరాబాద్, కంపెనీ ఎండీ ఇ.సుధీర్‌రెడ్డి, జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.బలరామిరెడ్డితోపాటు గుర్తుతెలియని ప్రభుత్వ ఉద్యోగులు, తదితరులపై నేరపూరిత కుట్ర, నిధుల అక్రమ తరలింపు అభియోగాలను పేర్కొంది. నగరంలోని సంస్థ కార్యాలయంతోపాటు నిందితుల ఇళ్లలో బుధవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకుంది. తమకు లోను కావాలంటూ ఐవీఆర్‌సీఎల్‌ పలు బ్యాంకులను ఆశ్రయించింది.

దీంతో వీరికి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నేతృత్వంలో ఐడీబీఐ, కెనరా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్, యూనియన్, ఎగ్జిమ్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంకులతో కలిపి కన్సార్షియంగా ఏర్పడ్డాయి. కంపెనీకి పలు దఫాలుగా భారీ రుణం ఇచ్చాయి. కానీ, తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఈ క్రమంలో బ్యాంకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో కంపెనీ లావాదేవీల్లో పలు అవకతవకలు వెలుగుచూశాయి. దీంతో  దాదాపు రూ.4,837 కోట్లు నష్టం వాటిల్లిందంటూ ఎస్‌బీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు చేస్తోంది. (చదవండి: ‘డీఎల్‌ఎఫ్‌’ భూ వ్యవహారంపై కౌంటర్‌ వేయండి)

మహేష్‌ బ్యాంకు కేసులో తీర్పు రిజర్వు 
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ మహేష్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల ఎన్నికకు పోలింగ్‌ నిర్వహించి, కౌంటింగ్‌ ప్రారంభించిన తర్వాత కొన్ని ఓట్లను లెక్కించకుండా నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ డైరెక్టర్ల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఓట్లు లెక్కిం చి ఫలితాలు ప్రకటించేలా ఆదేశించాలని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బుధవారం వాదనలు వినిపించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top