పంచాయితీకి రాలేదని కుల, గ్రామ బహిష్కరణ

Caste Relegation Issue In Nalgonda - Sakshi

సాక్షి, శాలిగౌరారం(నల్లగొండ): పంచాయితీకి పిలిస్తే రాలేదని ఓ కుటుంబాన్ని కుల, గ్రామ బహిష్కరణ చేశారు పెద్దమనుషులు. ఈ తీర్పును సదరు కులానికి చెందిన ప్రజలు అమలు చేయాలని, వారితో ఎవరైనా మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10 వేల జరిమానా విధిస్తామని ఒప్పంద పత్రాలు రాశారు. ఈ ఘటన శాలిగౌరారం మండలం బైరవునిబండలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భైరవునిబండ గ్రామానికి చెందిన పులిగిల్ల అంజయ్య కుటుంబానికి అదే సామాజిక వర్గానికి చెందిన మరో కుటుంబానికి మధ్య ప్రభుత్వ ఇంటి స్థల విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ గొడవ కులపెద్దమనుషుల వద్దకు చేరింది. ఈ నెల 26న కొంతమంది కులపెద్దలు పంచాయితీ మాట్లాడేందుకని ఇరు కుటుంబీకులకు కబురు పంపారు. దీనికి అంజయ్య కుటుంబీకులు వెళ్లలేదు. దీంతో కోపోద్రిక్తులైన కులపెద్దలు మా మాట వినకుండా కులధిక్కరణ చేశాడని అంజయ్య కుటుంబాన్ని కులంతోపాటు గ్రామ బహిష్కరణ చేశారు. ఈ కుటుంబీకులతో సదరు కులానికి చెందిన వ్యక్తులు మాట్లాడినా, ఎలాంటి సహాయ సహకారాలు అందించినా రూ.10వేల జరిమానా విధిస్తూ హుకుం జారీ చేశారు. దీనిపై ఒప్పంద పత్రాలు రాసి ప్రచారం చేశారు.

ఈ క్రమంలో మరుసటి రోజు (27న) అంజయ్య సొంత పనిపై సాయంత్రం వేళలో వీధిలోనుంచి వెళ్తుండగా గ్రామానికి చెందిన కులపెద్దలు గ్రామంలో కూడా తిరగవద్దని అతన్ని బెదిరించారు. దీంతో తీవ్ర అవమానానికి గురైన అంజయ్య అదేరోజు రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కులపెద్దలు పులిగిల్ల పోశయ్య, పులిగిల్ల బిక్షమయ్య, నరిగె శంభయ్య, దుప్పెల్లి నరేశ్‌లపై ఫిర్యాదు చేశాడు. దీంతో కుల పెద్దమనుషులపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  

చదవండి:  ఆ చెన్నై రోజులు తిరిగిరావు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top