బీజేపీ నేత ఆత్మహత్య.. మహిళా ఐపీఎస్‌పై కేసు

Case Filed Against Haryana Cop Over Abetment BJP Leader Suicide - Sakshi

చండీఘడ్‌‌: హరియాణా బీజేపీ నేత హరీశ్‌ శర్మ మృతి నేపథ్యంలో పానిపట్‌ ఎస్పీ మనీషా చౌదరిపై కేసు నమోదైంది. హరీశ్‌ను ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలతో ఉన్నతాధికారులు ఈ మేరకు ఆమెపై చర్య తీసుకున్నారు. మనీషాతో పాటు మరో ఇద్దరు పోలీసులపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం. హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఆదేశాల మేరకు మనీషాపై కేసు నమోదు చేయగా, డిప్యూటీ సీఎం దుష్యంత్‌ చౌతాలా మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘‘ఒకవేళ ఎస్పీపై ఈ విధంగా కేసు నమోదు చేసినట్లయితే, రాష్టంలో ఏదో ఒకచోట నేరం జరిగితే అందుకు డీజీపీపై కూడా ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేస్తారా’’ అంటూ చౌతాలా ప్రశ్నించారు. దీంతో ఈ కేసు రాష్ట వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. దీపావళి పండుగ నేపథ్యంలో టపాసులపై నిషేధం గురించి బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ హరీశ్‌ శర్మ(52) కుమార్తె అంజలి శర్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. (చదవండి: కశ్మీర్‌ భూ స్కామ్‌లో మాజీ మంత్రులు!)

ఈ క్రమంలో హరీశ్‌తో పాటు ఆయన కూతురు సహా మరో 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన హరీశ్‌ శర్మ నవంబరు 19న కెనాల్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, తనను కాపాడేందుకు ప్రయత్నించిన స్నేహితుడు కూడా చనిపోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి అంజలి శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మా నాన్నను ఓ ఉగ్రవాదిలా చిత్రీకరిస్తూ పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన తర్వాత వారు వ్యవహరించిన తీరుతో ఆయన కుంగిపోయారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: అమానుషం: పసిపాపను వదిలించుకునేందుకు..)

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి అనిల్‌ విజ్‌ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్‌ చీఫ్‌ మనోజ్‌ యాదవ్‌ను సోమవారం ఆదేశించారు. సత్వరమే స్పందించకపోవడంతో ఆయనకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పానిపట్‌ ఎస్పీ మనీషా చౌదరిపై ఉన్నతాధికారులు కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా మనీషా చౌదరి 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌. త్వరలోనే ఆమె చండీఘర్‌ ఎస్‌ఎస్‌పీ(ట్రాఫిక్‌)గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా, ఈ మేరకు కేసు నమోదు కావడంతో జాప్యం నెలకొంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top