నటి దారుణ హత్య.. 47 కత్తిపోట్లు: నిందితుడికి ఉరిశిక్ష

In California Serial Killer Known As the Hollywood Ripper Sentenced to Death - Sakshi

20 ఏళ్ల క్రితం నాటి కేసులో ‘హాలీవుడ్‌ రిప్పర్‌’కు మరణశిక్ష విధించిన లాస్‌ ఏంజిల్స్‌ కోర్టు

నటితో పాటు మరో మహిళ హత్య.. మరో స్త్రీపై హత్యాయత్నం

వాషింగ్టన్‌/కాలిఫోర్నియా: ప్రముఖ హాలీవుడ్‌ నటి ఆష్లే షెర్లిన్‌తో పాటు మరో మహిళను హత్య చేసినందుకు గాను ‘హాలీవుడ్‌ రిప్పర్‌’గా ప్రసిద్ధి చెందిన మైఖెల్‌ గార్గిలోకు లాస్‌ ఏంజిల్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ నేరాలతో పాటు మరో హత్యాయత్నం కేసులో 2019లోనే మైఖెల్‌ దోషిగా తేలాడు. ఈ క్రమంలో కోర్టు 2021, జూలైలో అతడికి మరణ శిక్ష విధించింది. నిందితుడు మైఖెల్‌.. హాలీవుడ్‌ నటి ఆష్లే ఎల్లరిన్‌తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 

'హాలీవుడ్ రిప్పర్‌'గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22) నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి. హత్యకు గురైన నాటి రాత్రి ఆష్లే, తన సహానటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం హాలీవుడ్‌లోని ఆమె ఇంటికి వెళ్లిన నటుడు కుచర్ తలుపు తట్టినా ఆమె తీయలేదు. కిటికీలోంచి ఆయన చూడగా నేలపై ఏదో పడినట్లు కనిపించింది. వైన్ పడి ఉంటుందని భావించి వెళ్లిపోయాడు కుచర్‌. ఆ మరసుటి రోజు ఎల్లరిన్‌ శవాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు. ఈ క్రమంలో నటుడు కుచర్‌ ఈ కేసులో ముఖ్య సాక్షిగా మారాడు. 

ఆ తర్వాత మైఖెల్‌ 2005లో మారియా బ్రూనో(32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు. బ్రూనో హత్య జరిగిన మూడేళ్ల తర్వాత అనగా 2008, జూన్‌లో మైఖేల్‌ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు. ఆమె ఇంట్లో ప్రవేశించి.. కత్తితో దాడి చేసి హత్య చేయాలని భావించాడు. కానీ అదృష్టవశాత్తు మర్ఫీ తప్పించుకున్నారు. అనంతరం మర్ఫీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైఖెల్‌ నేరాలు వెలుగు చూశాయి. ఇక మర్ఫీపై దాడి తరువాత అక్కడి నుంచి పారిపోయినప్పటికీ సంఘటనా స్థలంలో మైఖేల్ రక్తం ఉండటంతో దాని ఆధారంగా శాంటమోనికా పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. మర్ఫీ ఈ కేసులో ప్రధాన సాక్ష్యిగా ఉన్నారు. 

రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాలు ఎదుర్కొన్న మైఖేల్ విచారణ సందర్భంగా తాను అమాయకుడినకని కోర్టుకు తెలిపేవాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ న్యాయస్థానం ఈ కేసులకు సంబంధించి మైఖెల్‌కు మరణశిక్ష విధించింది. కాకపోతే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కాలిఫోర్నియా రాష్ట్రంలో 2019 నుంచి మరణశిక్షల అమలుపై నిషేధం ఉంది. 2006 తరువాత కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు. మరోవైపు 1993లో ఒక 18 ఏళ్ల అమ్మాయిని చంపిన కేసులోనూ మైఖేల్ ముద్దాయిగా ఉన్నాడు. ఇందుకు సంబంధించి ఇల్లినాయిస్‌లో ఈ కేసు విచారణ జరిగింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top