అనాథాశ్రమం కాదది..

Black Money Transactions in Ameenpur Orphan House Medak - Sakshi

అమీన్‌పూర్‌ అనాథాశ్రమంపై ఆరోపణల వెల్లువ 

నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేలా విరాళాల ప్రక్రియ 

రెండు జిల్లాల సరిహద్దులో అనాథాశ్రమం 

పటాన్‌చెరు: అమీన్‌ఫూర్‌ అనాథశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి  వెలుగులోకి వస్తున్నాయి. అనాథశ్రమం ముసుగులో అనేక చీకటి వ్యవహారాలు సాగేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు కూడ ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని, చిన్నారులను అందంగా అలంకరించి బయటకు పంపే వారని చెబుతున్నారు. వాస్తవానికి  పిల్లలను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ అనుమతి లేనిది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పంపకూడదు. రంగారెడ్డి జిల్లాలో అనాథాశ్రమం రిజిస్ట్రేషన్‌ జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శివారు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. (మరో బాలికపైనా అఘాయిత్యం!)

అనాథశ్రమ భవనంపైఉన్న అడ్రస్‌ మాత్రం మియాపూర్‌ అనే రాసి ఉంది. అయినా రంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించలేదు.  రేయింబవళ్లు  అధికారుల స్టిక్కర్లగల వాహనాల రాకపోకలు సాగేవని, చిన్నారులను చాలా వేధించేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. అశ్రమ చిన్నారులే కాకుండా బయట నుంచి కూడా మహిళలు, యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు ఉన్నాయి. అనాథశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ(చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ) సిఫారసు చేసిన వారే ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారం ఆశ్రమంలో 49 మంది విద్యార్థులు ఉండాలి కానీ, 60 మంది వరకు బాలికలు ఉండేవారని చెబుతున్నారు.

జిల్లా అధికారులకు తెలియకుండా అనాథ పిల్లలు చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. తరచూ చిరునామాలు మారుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన అనాథాశ్రమం అమీన్‌పూర్‌లో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆశ్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అధికార యంత్రంగానికి తెలియకుండా నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో మియాపూర్‌ దీప్తి శ్రీనగర్‌లో ఆశ్రమం నిర్వహించేవారని తెలిసింది. విజయవాడకు చెందిన నిర్వాకురాలు ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐలు నుంచి విరాళాలు సేకరించేవారని, చాలా స్వల్పవ్యవధిలో  రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించాలరని తెలిసింది. ఆశ్రమం ముసుగులో కొందరు బడా బాబులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనాథాశ్రమానికి నిధులు ఇచ్చే వారికి పూర్తి సొమ్ము ఇచ్చేసి అందులో కొంత సొమ్మును కమిషన్‌ రూపంలో తీసుకునే ఆశ్రమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 

ఉలిక్కి పడిన అమీన్‌పూర్‌
పటాన్‌చెరు: అమీన్‌పూర్‌లో మరో ‘ముజఫర్‌పూర్‌’ ఘటన స్థానికులను కదిలించింది. అనాథ బాలికను చిదిమేసిన అంశంపై మానవతవాదులు కదిలిపోయారు. అన్ని టీవీ చానళ్లలోనూ ఈ వార్తపై కథనాలివ్వడంతో అమీన్‌పూర్‌ వాసులు ఒక్కసారిగా ఆందోళనకులోనయ్యారు. అమీన్‌పూర్‌లోని మియాపూర్‌ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్‌ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్‌ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఆశ్రమంలోని మిగిలిన చిన్నారుల విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాలిక మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని వివిధ సంఘాలు,     పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. డీఎస్పీ రాజేశ్వర్‌ సాక్షితో మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో కేసు నమోదయ్యిందని,  అత్యాచార నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ పట్టణ నాయకుడు కె.నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాయని లలిత ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సాఆర్‌సీపీ ఎస్పీ విభాగం జిల్లా అధ్యక్షుడు డప్పు రాజు మాట్లాడుతూ బాలిక మృతికి కారకులైన వారందరినీ గుర్తించాలని, ఆశ్రమ అనుమతులన్ని రద్దు చేయాలన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top