పాతకక్షలతో టీడీపీ గ్రామ నేత హత్య 

Assassination of TDP village leader with Old faction - Sakshi

హతుడు చంద్రయ్య మాచర్ల టీడీపీ ఇన్‌చార్జి 

జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు 

బ్రహ్మారెడ్డి 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు 

హతుడి కుటుంబానికి చంద్రబాబు పరామర్శ 

వెల్దుర్తి/మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య (35) గురువారం హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన్ని కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హతుడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకేరోజు జరిగిన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు.

తోట చంద్రయ్య, చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్‌ రోడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండటం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్‌ సీఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్‌చార్జి ఎస్‌ఐ పాల్‌ రవీందర్‌లు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు  సేకరించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చే వరకూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించకూడదంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని గుండ్లపాడు తరలించారు. 

చంద్రబాబు పరామర్శ 
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం గుండ్లపాడు చేరుకుని చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రయ్య పాడె మోశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాననిచెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జి  బ్రహ్మారెడ్డికి వచ్చిన స్పందనను చూసి ఆయనకు ఒక మెస్సేజ్‌ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రాన్ని హత్య చేయించారని ఆరోపించారు.

రౌడీ రాజకీయాలు చేసేవారిని జగన్‌ కంట్రోల్‌ చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మా ప్రాణాలు తీయడం ఎంత సులువో, మీ ప్రాణాలు తీయడం అంత సులువేనని చెప్పారు. నేరస్థులు పరిపాలిస్తున్నారు కాబట్టే పోలీసులను అడ్డం పెట్టుకుని హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. పల్నాడులో ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని చెప్పారు. ఆ సమయంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్‌  చాటుకున్నారని విమర్శించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top