పదేళ్ల అన్వేషణకు తెర

Anti-human trafficking team cracked missing case after ten years - Sakshi

2012లో కనిపించకుండా పోయిన మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు 

కేసును ఛేదించిన యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ బృందం

నెల్లూరు (క్రైమ్‌): పదేళ్ల కిందట అదృశ్యమైన ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లల కేసును యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ (ఏహెచ్‌టీయూ) పోలీసులు ఛేదించారు. వారిని తీసుకొచ్చి ఆదివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అల్తుర్తికి చెందిన జయంతి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2012లో కనిపించకుండా పోయింది. అప్పట్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం ఎంత గాలించినా ఎలాంటి సమాచారం లభించకపోవటంతో దర్యాప్తు ముందుకు సాగలేదు.

ఎస్పీ సీహెచ్‌ విజయారావు ఇటీవల ఏహెచ్‌టీయూను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏహెచ్‌టీయూ ఎస్‌ఐ విజయశ్రీనివాస్‌ ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకున్నారు. తప్పిపోయిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారం లేకపోవడంతో పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. సదరు మహిళపై రేషన్‌కార్డు ఉండటాన్ని గుర్తించి, దాని ఆధారంగా ఆమె గుంటూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. శనివారం రాత్రి ఎస్‌ఐ తన సిబ్బందితో గుంటూరుకు చేరుకుని జయంతి, ఆమె ఇద్దరు పిల్లలను తమ సంరక్షణలోకి తీసుకుని నెల్లూరుకు తీసుకువచ్చారు. ఆదివారం పొదలకూరు పోలీసుస్టేషన్‌లో వారిని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top